చరిత్రను చెరిపేసి.. బంగ్లాదేశ్ టెక్ట్స్ బుక్స్ లో ఇందిర ఫోటో తొలగింపు
ఇప్పుడు అక్కడి తాత్కాలిక సర్కారు మరింత ముందుకెళ్దింది.;
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం బరితెగించింది.. అసలు ఆ దేశ ఏర్పాటుకు కారణమైన వారినే ఇప్పుడు పక్కకుపెడుతోంది. నిరుడు ఆగస్టులో షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనం అనంతరం జాతి పిత ముజిబుర్ రెహ్మాన్ విగ్రహాలను అల్లరి మూకలు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడి తాత్కాలిక సర్కారు మరింత ముందుకెళ్దింది.
అసలు బంగ్లాదేశ్ ఏర్పాటు వెనుక ఉన్న బలమైన శక్తి ఎవరంటే.. భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ. పాకిస్థాన్ మెడలు వంచి మరీ బంగ్లాదేశ్ ఏర్పడేలా చేశారు ఇందిరా. దీనికిగాను ఆమెను అటల్ బిహారీ వాజ్ పేయీ వంటి ప్రతిపక్ష నేతలు కూడా ‘విజయేందిర’ అంటూ గొప్పగా కీర్తించారు.
ఇలాంటి ఇందిరాగాంధీ ఫొటో తీసేసి.. భారత్ పాత్రను తగ్గించేస్తోంది బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం. షేక్ హసీనా తండ్రి, బంగబంధు అయిన ముజిబుర్ రెహమాన్ తో పాటు భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఫొటోలను టెక్ట్స్ బుక్స్ లోంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
వచ్చే విద్యా సంవత్సరానికి పాఠశాల విద్య సిలబస్ లలో కీలక మార్పులు చేస్తోంది బంగ్లాదేశ్. అన్ని పాఠ్య పుస్తకాల్లో నుంచి మాజీ ప్రధాని హసీనా పేరును పూర్తిగా తొలగించింది. బంగ్లా స్వాతంత్ర్య ఉద్యమంలో భారత పాత్రను తగ్గించేసి కొత్త పుస్తకాల్లో మార్పులు చేస్తోంది.
1972 ఫిబ్రవరి 6న కోల్‌కతా ర్యాలీలో భారత ప్రధాని ఇందిరాగాంధీ, ముజిబుర్ ప్రసంగించారు. మరుసటి నెలలో ఇందిర ఢాకాలో పర్యటించిన ఫొటోలను చరిత్ర పుస్తకాల నుంచి తొలగించారు.
బంగ్లాకు 1971లో స్వాతంత్ర్యం వచ్చింది. ఆనాటి యుద్ధంలో భారత ఆర్మీ, ముజిబుర్ రెహ్మాన్ సారథ్యంలోని బంగ్లా ముక్తివాహిని పాల్గొన్న అంశాలు, ఆ ఏడాది డిసెంబరు 16న పాక్ సైన్యం లొంగిపోయిన దృశ్యాలను మాత్రం కొత్త సిలబస్ లో కొనసాగించారు.
బంగ్లా స్వాతంత్ర్యానికి భారత్ కారణమంటూ చరిత్రలో పేర్కొన్నారు. తాజా సవరణల్లో దీన్ని మార్చారు. ముందుగా భూటాన్ సాయం చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు అన్ని పాఠ్య పుస్తకాల వెనక పేజీలో షేక్ హసీనా సందేశం ఉండగా.. దాన్ని కూడా తొలగించారు. ముజిబుర్ నాయకత్వాన్ని కీర్తిస్తూ రాసిన అంశాలను కూడా తగ్గించారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న ఇతర నేతల ప్రస్తావనను చేర్చారు.