మోడీ చెప్పారు.. చంద్రబాబు చేశారు.. వెరీ ఇంట్రస్టింగ్!
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాటే వేదంగా చంద్రబాబు ఇటీవల కాలంలో కొన్నిపనులు చేస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాటే వేదంగా చంద్రబాబు ఇటీవల కాలంలో కొన్నిపనులు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన తొలిసారి జాతిపిత మహాత్మా గాంధీ ఏర్పాటు చేసిన `దండి కుటీర్`ను సందర్శించారు. చంద్రబాబు దండి కుటీర్‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అది కూడా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ..ప్రధాని చెప్పడంతో వెంటనే అక్కడకు వెళ్లిపోయారు. వాస్తవానికి పునరుత్పాదక ఇంధన వనరుల పెట్టుబడి దారుల సదస్సు గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగానే చంద్రబాబును దండి కుటీర్ ను సందర్శించాలని ప్రధాని మోడీ సూచించారు. మహాత్మా గాంధీ జీవిత విశేషాలను అత్యాధునిక టెక్నాలజీతో, అరుదైన చిత్రాలతో ఏర్పాటు చేసిన దండి కుటీర్ గురించి ఆయన స్వయంగా వివరించారు. అంతేకాదు.. ఇక్కడకు సమీపంలోనే ఉంది.. వెళ్లండి అని ప్రధాని మోడీ సూచించారు. ఆ వెంటనే సీఎం చంద్రబాబు దండి కుటీర్‌ను సందర్శించి కాసేపు అక్కడ గడిపారు. సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాలను రాశారు. గాంధీజీ స్మృతికి నివాళులర్పించారు. దండి కుటీర్ సందర్శన తన జీవితంలో మరపురాని ఘటనగా గుర్తిండి పోతుందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు.
``గాంధీజీ జీవిత చరిత్రను భవిష్యత్తు తరాలు తెలుసుకునేలా దండికుటీర్ ఉంది`` అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అనంతరం సీఎం చంద్రబాబు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా పటేల్ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విజనరీ లీడర్ గా, అభివృద్ధి పాలకుడిగా చంద్రబాబు గుర్తింపు పొందారని పేర్కొన్నారు. కాగా, భూపేంద్ర పటేల్ ఆతిధ్యానికి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించి పలు ప్రభుత్వ పాలసీలపై గుజరాత్ సీఎంతో ఏపీ సీఎంతో చర్చించారు.
ఏంటీ దండి కుటీర్
ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించిన దండి కుటీర్ ప్రాముఖ్యం ప్రస్తుత తరానికి పెద్దగా తెలియదు. బ్రిటీష్ హయాంలో ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకిస్తూ.. చేపట్టిన ఉద్యమమే దండి మార్చ్‌గా(1930) పిలుస్తారు. సముద్ర తీరంలోని దండి గ్రామానికి పాదయాత్రగా చేరుకుని.. అక్కడ ఉప్పును స్వయంగా తయారు చేయాలన్న పిలుపుతో గాంధీ సహా లక్షల మంది పాదయాత్రగా సబర్మతి ఆశ్రమం నుంచి దండి గ్రామం వరకు యాత్ర చేపట్టారు. దీనిని పురస్కరించుకుని దండి గ్రామంలో దండి కుటీర్‌ను అభివృద్ది చేశారు. నాటి దండి యాత్రకు సంబంధించిన విశేషాలతో ఇక్కడ దేశంలోనే అది పెద్ద మ్యూజియంను ఏర్పాటు చేశారు. దీనిని సందర్శించేందుకు కేంద్ర ప్రభుత్వం సకల సౌకర్యాలుకల్పిస్తున్న విషయం చాలా మందికి తెలియదు.