చంద్రబాబు సక్సెస్ ఫుల్ సీఎం కాదా ?

దేశంలో అందరి కన్నా సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునే చంద్రబాబు విషయంలో కొన్ని తమాషా అయిన విషయాలు ఉన్నాయి.

Update: 2024-09-17 11:26 GMT

దేశంలో అందరి కన్నా సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకునే చంద్రబాబు విషయంలో కొన్ని తమాషా అయిన విషయాలు ఉన్నాయి. ఆయన ఎపుడూ కంటిన్యూగా రెండు సార్లు గెలిచిన దాఖలాలు లేవు. ఒక ఎన్నికల్లో గెలిస్తే మరో ఎన్నికల్లో ఓటమి పాలు అవుతూ వచ్చారు.

అందుకే బాబు మూడు దశాబ్దాల క్రితం సీఎం అయినా పద్నాలుగేళ్లు మాత్రమే సీఎం గా ఉన్నారు. ఈసారి ఆయన గెలిచారు. అలా ఈ టెర్మ్ పూర్తి అయితే రెండు దశాబ్దాల కాలం పాలించిన సీఎం గా తెలుగు నాట బాబు రికార్డుని క్రియేట్ చేయవచ్చు.

ఇదిలా ఉంటే బాబు వరసగా ఎందుకు గెలవలేక పోతున్నారు  అన్నది ఒక రాజకీయ చర్చగానే ఉంది. తెలుగు రాష్ట్రాలలోనే చూస్తే వైఎస్సార్ వరుసగా రెండు సార్లు సీఎం గా గెలిచారు. కేసీఆర్ కూడా రెండు సార్లు సీఎం వరసగానే అయ్యారు.

ఇక దేశంలో చూస్తే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా వరసబెట్టి గెలుస్తూ వస్తున్నారు. ఆయన మూడు సార్లు సీఎం గా ఉన్నారు. బీహార్ లో చూస్తే నితీష్ కుమార్ వరసగా గెలుస్తూ ముఖ్యమంత్రి పీఠం మీద కంటిన్యూ గా ఉంటున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా వరసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సీఎం అనిపించుకున్నారు. యూపీ సీఎం ఆదిత్యనాథ్ యోగి యూపీ సీఎం గా వరసగా రెండు సార్లు గెలిచారు. ఈశాన్య రాష్ట్రాలలో చాలామంది రెండు కంటే ఎక్కువగానే వరసగా గెలిచిన చరిత్ర ఉంది.

అదే విధంగా ఈ లిస్ట్ దేశంలో చదువుకుంటూ పోతే చాలా మంది ముఖ్యమంత్రులు వరసగా రెండు మూడు నాలుగు సార్లు గెలిచిన చరిత్ర కళ్ల ముందు కనిపిస్తుంది. అయితే చంద్రబాబు మాత్రం 1995లో డైరెక్ట్ గా సీఎం అయ్యారు. అంటే ఎన్టీఆర్ సాధించి పెట్టిన అధికారాన్ని ఆయన కేవలం ఎనిమిది నెలలలోనే మామ నుంచి అలా అందుకున్నారు అన్న మాట.

ఇక చంద్రబాబు తానుగా ఎన్నికల సారధ్యం వహించి గెలిచినది 1999 ఎన్నికల్లో. అది కూడా వాజ్ పేయ్ కార్గిల్ వార్ తో వచ్చిన ఇమేజ్ తో అదే సమయంలో పొత్తులతోనే అని అంటారు ప్రత్యర్ధులు. అలా బాబు తన ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక 2004లో వచ్చిన ఎన్నికల్లో రెండోసారి గెలవలేక ఓటమిని చవి చూశారు.

అంతే కాదు ఆయన 2009లోనూ మరోసారి ఓడారు. అంటే గెలుపు ఆటను వరసగా కంటిన్యూ చేయలేని బాబు ఓటమిని మాత్రం రెండు సార్లు కంటిన్యూ చేశారు అని అంటారు. ఇక 2014లో ఉమ్మడి ఏపీ రెండుగా విడిపోయాక మాత్రం చంద్రబాబు ఏపీకి తొలి సీఎం అయ్యారు. అయితే ఇది కూడా అప్పట్లో వచ్చిన నరేంద్ర మోడీ క్రేజ్, పవన్ కళ్యాణ్ సినీ చరిష్మా కలసి బాబుని గెలుపు తీరాలకు చేర్చాయని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

ఇక చంద్రబాబు తానుగా 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓటమిని మూటగట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఇక 2024 ఎన్నికల్లో మరోసారి చంద్రబాబు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ లతో పొత్తు పెట్టుకుని కూటమి కట్టి మరీ అధికారంలోకి వచ్చారు. దీంతో ఒక ఎన్నికల్లో గెలిచి మరో ఎన్నికలో ఓడిపోతూ వస్తున్న చంద్రబాబు ఎక్కడ సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ అవుతారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరో వైపు చూస్తే ఈసారి అయినా చంద్రబాబు తాను ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేస్తేనే 2029 ఎన్నికల్లో వరస విజయం లభిస్తుంది అని అంటున్నారు. ఆ విధంగా బాబు రెండోసారి వరసగా గెలవలేరు అన్న అపప్రధ పోతుంది అని అంటున్నారు. అలా కాదు అనుకుంటే బాబు మార్క్ పొలిటికల్ ట్రాక్ రికార్డు రిపీట్ అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.

గతంతో పోలిస్తే ఇపుడు ఇంకా ఎక్కువగా సోషల్ మీడియా వాడకం పెరిగింది. దాంతో మాటలు చెప్పి జనాలను ఆకట్టుకోవడం అంత ఈజీ కాదు అని అంటున్నారు. ఇక ఏపీ ప్రజల తీరుని చూస్తే వారు తమిళనాడు లెక్కన ఆలోచిస్తారు అని అంటున్నారు. ఏ పార్టీకి వరసగా రెండు సార్లు ఇవ్వరు అని అంటున్నారు.

అది 2014లోనే మొదలైంది అని అంటున్నారు. ఒక చాన్స్ ఇచ్చి మళ్లీ అయిదేళ్ళు పక్కన కూర్చోబెడతారు అని కూడా అంటున్నారు. ఇలా ఫుల్ మెచ్యూరిటీతో ఆంధ్రా జనాలు తీర్పును ఇస్తున్న నేపథ్యంలో చంద్రబాబు అయిదు కాదు పదేళ్ళు అధికారంలో ఉండాలీ అంటే తన రాజకీయ పంధాను పూర్తిగా మార్చుకోవాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News