ఏపీలో నూతన క్రీడా పాలసీకి చంద్రబాబు శ్రీకారం
తాజా నిర్ణయంతో ఈ నగద ప్రోత్సాహకాల్లో హర్యానాను ఏపీ వెనక్కి నెట్టింది. దేశంలోనే క్రీడాకారులకు అత్యధిక నగదు ప్రోత్సాహకాలిచ్చే రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది.
క్రీడాకారులకు ఏపీ సీఎం చంద్రబాబు తీపి కబురు చెప్పారు. ఏపీలో కొత్త క్రీడా పాలసీపై చర్చించిన చంద్రబాబు క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో పతకాలు సాధించిన వారి నగదు ప్రోత్సాహకాన్ని భారీగా పెంచారు. తాజా నిర్ణయంతో ఈ నగద ప్రోత్సాహకాల్లో హర్యానాను ఏపీ వెనక్కి నెట్టింది. దేశంలోనే క్రీడాకారులకు అత్యధిక నగదు ప్రోత్సాహకాలిచ్చే రాష్ట్రంగా ఏపీ అవతరించనుంది.
ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన వారికి ప్రస్తుతం రూ.75 లక్షలు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నారు. ఇకపై వారికి రూ.7 కోట్లు ఇవ్వాలని, రజత పతకం సాధిస్తే 50 లక్షలకు బదులు 5 కోట్లు, కాంస్య పతకం సాధిస్తే 30 లక్షలకు బదులు 3 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని కూడా సూచించారు. ఏషియన్ గేమ్స్ లో బంగారు పతకం సాధిస్తే రూ.4 కోట్లు, రజతం సాధిస్తే రూ.2 కోట్లు, కాంస్యం సాధిస్తే రూ.1 కోటి ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. ఏషియన్స్ గేమ్స్ లో పాల్గొన్న వారికి రూ.10 లక్షలు ఇవ్వాలని పేర్కొన్నారు.
వరల్డ్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ పోటీల్లో స్వర్ణ పతకం సాధిస్తే రూ.50 లక్షలు, రజతం సాధిస్తే రూ.35 లక్షలు, కాంస్యం సాధిస్తే రూ.25 లక్షలు ఇవ్వబోతున్నారు. నేషనల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.10 లక్షలు, రజతం సాధించిన వారికి రూ.5 లక్షలు, కాంస్య పతకం సాధించిన వారికి రూ.3 లక్షల ప్రోత్సాహం ఇవ్వాలని ప్రతిపాదనలు చేశారు. ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్ లో బంగారు పతకం సాధించిన వారికి రూ.2.50 లక్షలు, రజత పతకం సాధించిన వారికి రూ.2 లక్షలు, కాంస్యం సాధించిన వారికి రూ.1 లక్ష చొప్పున ప్రోత్సాహం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఒలింపిక్, ఏషియన్ గేమ్స్ లో పతకాలు సాధిస్తే గ్రూప్-1 ఉద్యోగాలివ్వాలని సూచించారు.