ఢిల్లీ సీఎంగా రేఖ ప్రమాణం.. బాబు, పవన్ కు మోడీ ప్రాధాన్యం.. హైలెట్స్ ఇవీ
ఈ రాజకీయ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
దేశ రాజకీయాల్లో ముఖ్యమైన పరిణామం ఈ రోజు చోటుచేసుకుంది. బీజేపీ గతంలో ఎన్నడూ దక్కని ఢిల్లీ అసెంబ్లీని సొంతం చేసుకున్న తర్వాత, ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ విజయవంతంగా నిర్వహించింది. ఈ రాజకీయ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వీరు దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ ప్రధాన మిత్రపక్షంగా ఉన్నందున, ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ వేడుకలో పాల్గొన్నారు.
- ప్రత్యేక అతిథులు వీరే
గురువారం మధ్యాహ్నం రామ్‌లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు. 26 ఏళ్ల విరామం తర్వాత దిల్లీలో అధికారాన్ని దక్కించుకున్న భాజపా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, భాజపా అగ్రనేతలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*కొలువుదీరిన ఢిల్లీ కేబినెట్.. మంత్రులు వీరే..
రేఖా గుప్తా ఉదయం తన నివాసం నుండి బయల్దేరి హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం రామ్‌లీలా మైదానానికి చేరుకుని హాజరైన వారిని అభివాదించారు. ఈ కార్యక్రమానికి సాధువులు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భద్రతను పటిష్ఠంగా నిర్వహిస్తూ 25,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. రేఖా గుప్తాతో పాటు భాజపా ఎమ్మెల్యేలు పర్వేశ్ వర్మ, ఆశీష్ సూద్, మజీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్త సీఎంకు జడ్ కేటగిరీ భద్రతను కేటాయించనున్నారు.
-చంద్రబాబు, పవన్ లకు మోడీ పెద్దపీట..
ప్రమాణ స్వీకార వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను స్నేహపూర్వకంగా పలకరించడం ఆసక్తిని రేకెత్తించింది. వీరి మధ్య జరిగిన మాటమాటల్లో వారి బీజేపీతో ఉన్న బలమైన పొత్తు స్పష్టంగా కనబడింది. అయితే, ఇది కేవలం ఢిల్లీ పర్యటన మాత్రమే కాదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రాజధానికి రావడానికి రాజకీయ ప్రాధాన్యత ఉంది. వీరి ప్రధాన ఉద్దేశ్యం ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనడమే అయినప్పటికీ, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించేందుకు వీరు ఢిల్లీ వచ్చినట్టు తెలుస్తోంది.
-కేంద్రంలో పవన్, బాబు లాబీయింగ్
ప్రధానంగా, ఈ రోజు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో సమావేశం అవ్వనున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాల గురించి చర్చించనున్నట్టు సమాచారం.అంతేకాదు, కేంద్ర మంత్రులతో కూడా వీరు భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్‌కు తగిన నిధుల కేటాయింపులు, ప్రాజెక్టుల మంజూరు వంటి విషయాలను ప్రస్తావించనున్నారు.
దీనిని బట్టి చూస్తే, చంద్రబాబు, పవన్ ఢిల్లీకి రావడం కేవలం ఒక ప్రమాణ స్వీకార కార్యక్రమం హాజరుకావడం మాత్రమే కాదు. రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీరు కీలక చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది.