అనిల్ భయ్యా...ఎక్కడ చెప్మా ?
వైసీపీలో వరసగా ఫైర్ బ్రాండ్ల పేర్లు చెప్పాలీ అంటే ముందు వరసలోకి వచ్చేస్తారు అనిల్ కుమార్ యాదవ్.;

వైసీపీలో వరసగా ఫైర్ బ్రాండ్ల పేర్లు చెప్పాలీ అంటే ముందు వరసలోకి వచ్చేస్తారు అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరుకు చెందిన ఈయన మొదట వైఎస్సార్ చలవతో 2009లో నెల్లూరు సిటీ టికెట్ ని కాంగ్రెస్ తరఫున సంపాదించుకుని పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలు అయ్యారు.
ఇక వైఎస్సార్ మరణంతో ఆయన జగన్ వైపు వచ్చారు. 2014, 2019లలో వైసీపీ నుంచి నెల్లూరు సిటీ తరఫున నెగ్గిన అనిల్ కుమార్ తన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తోనే పార్టీలో పలుకుబడి సంపాదించారు అని అంటారు. ఆయన 2014 నుంచి 2019 మధ్య అసెంబ్లీ లోపలా బయటా వైసీపీ తరఫున గట్టిగానే వాయిస్ వినిపించారు.
ఇక 2019లో ఆయనకు జగన్ మార్క్ సామాజిక సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవి దక్కింది. కీలకమైన జలవనరుల శాఖ ఇచ్చారు. అయితే మూడేళ్ళ పాటు ఆ పదవిలో ఉన్న అనిల్ తన పాలన కంటే ఎక్కువగా టీడీపీ జనసేనల మీద విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు అని విమర్శలు వచ్చాయి. ఆయన నోటి దూకుడు వల్ల కూడా వైసీపీ ఇబ్బంది పాలు అయింది అని అంటారు.
ఇక నెల్లూరులో ఆయన మార్క్ పాలిటిక్స్ తో వైసీపీలో వర్గ పోరు పెరిగింది. అదే విధంగా చూస్తే చాలా మంది నేతలు పార్టీలో సైలెంట్ అయ్యారు. అనేక మంది పార్టీని వీడిపోయారు. అయినా సరే అధినాయకత్వం ఆయన వైపే మొగ్గు చూపించింది. ఆయన కోరుకున్న వారికే నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చి ఆయనను నరసారావుపేటకు షిఫ్ట్ చేసింది. అలా ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు అనిల్.
ఇక ఓటమి తరువాత గత పది నెలల నుంచి అనిల్ జాడ లేదు. అధికారంలో ఉన్నపుడు భారీ సవాళ్ళు చేసి తొడలు కొట్టి మీసాలు తిప్పిన అనిల్ భయ్యా ఎక్కడా అని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీలో అయితే అనిల్ అడ్రస్ ఎక్కడ అనుకునే పరిస్థితి ఉంది. అయితే అనిల్ చెన్నైలో తన సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు అని అంటున్నారు.
రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకున్నారు అనే అంటున్నారు. ఇక వైసీపీ కూడా అనిల్ విషయంలో ఆశలు వదిలేసుకుంది అని అంటున్నారు. ఆయన ప్లేస్ లో నెల్లూరు సిటీ ఇంచార్జిగా చంద్రశేఖర్ రెడ్డి అని ఒక కీలక నేతను నియమించింది. ఆయన వైసీపీని అక్కడ పటిష్టం చేసే పనిలో పడ్డారు.
అనిల్ వర్గంగా ఉన్న వారు అనుచరులు కూడా ఇపుడు చంద్రశేఖర్ రెడ్డితోనే అంటున్నారు ఎందుకంటే అనిల్ ఎక్కడా కనిపించడం లేదని ఇక తమ రాజకీయం ఎలా అనుకున్న వారు అంతా కొత్త ఇంచార్జికి మద్దతుగా ఉంటున్నారు. మరో వైపు చూస్తే అపుడపుడు నెల్లూరు కి వస్తున్న అనిల్ తనకు అత్యంత సన్నిహితులు అయిన వారితోనే మాట్లాడుతూ వెళ్తున్నారని అంటున్నారు.
తన రాజకీయ విరామమం టెంపరరీ అని మళ్ళీ తాను దూకుడు చేస్తాను అని ఆయన సన్నిహితులతో అంటున్నారని టాక్. అయితే దాని మీద సొంత పార్టీలో బయటా కూడా సెటైర్లు పడుతున్నాయట. టెంపరరీ అంటే ఎపుడు కూటమి ప్రభుత్వం ఉన్నన్నాళ్ళూ ఇలా కనిపించకుండా పోవడమేనా అని అంటున్నారుట. విపక్షంలో ఉన్నపుడే పార్టీలో ధీటుగా నిలిచి పోరాడాలని అంటున్నారు.
అనిల్ అయితే ఒకసారి విపక్ష ఎమ్మెల్యే ఒక సారి మంత్రి ఇలా పదవులు ఉంటేనే రాజకీయం చేశారు తప్ప సాధారణ నాయకుడిగా జనంలోకి వచ్చి క్యాడర్ కి ధైర్యం ఇచ్చేలా ఇపుడు చేయడంలేదు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే 2009లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 2024 దాకా సాగిన అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ కధ ఆగినట్లేనా లేక మరోసారి వైసీపీ హైకమాండ్ తో మాట్లాడుకుని ఎన్నికల ముందు ఎంట్రీ ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. అయితే హైకమాండ్ అన్నీ చూసింది కాబట్టి అనిల్ కి నో చాన్స్ అనే అంటున్నారు ఆయన ప్రత్యర్ధులు.