బిగ్ బ్రేకింగ్... తిరుపతిలో అధికారులను సస్పెండ్ చేసిన చంద్రబాబు!

ఈ సమయంలో ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చంద్రబాబు చర్యలకు ఉపక్రమించారు.

Update: 2025-01-10 03:45 GMT

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. సుమారు 29 మంది భక్తులు ఆస్పత్రిలో చికిత్స పోందుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చంద్రబాబు చర్యలకు ఉపక్రమించారు.

అవును... తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చంద్రబాబు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో సమీక్ష అనంతరం స్పందిస్తూ.. డీఎస్పీ రమణ కుమార్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా... డీఎస్పీ రమణ కుమార్ బాధ్యత లేకుండా పనిచేశారని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీఎస్పీతో పాటు గోశాల డైరెక్టర్ హరనాథ్ రెడ్డిని సస్పెండ్ చేశామని.. ఇదే సమయంలో.. ఎస్పీ సుబ్బారాయుడు, సీ.ఎస్.వో. శ్రీధర్, జేఈవో గౌతమి లను తక్షణమే బదిలీ చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు.

ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్లూ ప్రకటించిన చంద్రబాబు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని.. గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని.. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున సాయం చేస్తామని బాబు ప్రకటించారు.

ఇలా గాయపడిన 33 మందితో పాటు తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరికి కలిపి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని.. బాధలో ఉన్నప్పటికీ స్వామి వారిని దర్శనం చేసుకోవాలనే సంకల్పం వారిలో ఉందని చంద్రబాబు తెలిపారు.

అనంతరం... తెలిసీ తెలియక మనం చేసే పనుల వల్ల దేవుడి పవిత్రత దెబ్బతినే పరిస్థితి వస్తే మంచిది కాదని.. మన అసమర్థత వల్ల దేవుడికి చెడ్డపేరు రావొద్దని చెప్పిన చంద్రబాబు... ఇక్కడ రాజకీయాలు చేయడానికి వీల్లేదని.. రాజకీయాలకు అతీతంతా శ్రీవారికి సేవ చేస్తున్నామనే భవనతో ముందుకుపోవాలని చెప్పడం గమనార్హం!

Tags:    

Similar News