కేంద్ర మంత్రి రామ్మోహన్‌పై చంద్రబాబు సీరియస్!
కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ యువ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు.
కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ యువ నాయకుడు కింజరాపు రామ్మోహన్ నాయుడిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ``ఎంత కేంద్ర మంత్రి అయినా.. ఒక ఎంపీనే అన్న విషయాన్ని ఆయన గుర్తుంచు కోవాలి`` అని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేసేందుకు సమయం కేటాయించలేక పోతే ఎలా? అని అసహనం కూడా వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు రాజకీయంగా చర్చకు వచ్చాయి.
అసలు ఏం జరిగింది?
ఏపీలో పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. శ్రీకాకు ళం, నంద్యాల, కృష్ణా జిల్లాల్లో ఈ కార్యక్రమాలు చేపట్టారు. వీటికి సంబంధించి చంద్రబాబు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. అయితే.. ఆయా జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, ఎంపీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. వారిని కూడా వర్చువల్‌గానే పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాల అభివృద్ధి ప్రణాళికలపై చంద్రబాబు వారితో సమీక్షించారు.
అయితే.. శ్రీకాకుళం జిల్లా కార్యక్రమాలకు.. ఈ జిల్లా నుంచి ఎంపికైన ఎంపీగా, పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు.. ``రామ్మోహన్ ఏరి? సమాచారం ఇవ్వలేదా? `` అని కలెక్టర్‌ను గద్దించారు. అయితే.. తాము సమాచారం ఇచ్చామని.. అత్యవసర పనులు ఉండడంతో ఆయన రాలేకపోతున్నట్టు చెప్పారని అన్నారు.
అయితే.. ఈ వివరణతో సీఎం చంద్రబాబు సంతృప్తి చెందలేదు. ఎంత అత్యవసర పనులు ఉన్నా.. ప్రజల ప్రయోజనాలకు మించిన పనులు ఏముంటాయని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రి అయ్యారంటే.. దానికి కారణం.. జిల్లా ప్రజలు గెలిపించడమేనన్నారు. ఈ విషయాన్ని మంత్రికి చేరవేయాలని కలెక్టర్‌కు సూచించారు. అనంతరం.. ఇతర మంత్రుల విషయాన్ని కూడా ఆరా తీశారు.