చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై షర్మిళ ఏడు సూటి ప్రశ్నలు!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు మంగళవారం సాయంత్రం బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే

Update: 2024-07-17 10:55 GMT

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు మంగళవారం సాయంత్రం బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం వన్ జన్ పథ్ లోని సీఎం అధికారిక నివాసం లో పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ ఢిల్లీ టూర్ పై షర్మిళ కీలక ప్రశ్నలు సంధించారు.

అవును... ఏపీ సీఎం చంద్రబాబు మంగళవారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ట్వీట్ చేసిన చంద్రబాబు.. “ఏపీలో ప్రజలు ఎన్డీయేకు అనుకూలంగా తీర్పునిచ్చారని.. ఫలితంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతాయని” తెలిపారు. ఈ నేపథ్యలోనే షర్మిళ కీలక ప్రశ్నలు సంధించారు.

ఇందులో భాగంగా... "అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు" అని మొదలుపెట్టిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ... వరుసగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఆ ప్రశ్నల లిస్ట్ ఈ విధంగా ఉంది!

ఎన్డీయే కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు.. ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..?

ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి.. బీజేపీ పెద్దలకు జీ హుజూర్ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు..?

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో గానీ, ఇతర మంత్రులతో గానీ ఒక్క హామీ మీదా ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు..?

గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా..?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదు అని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా..?

పోలవరం ప్రాజెక్ట్ నిధులపై స్పష్టత ఇచ్చారా..?

రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సహాయం ఏమిటో చెప్పగలారా?... అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ.

అనంతరం... "ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న.. ఇదే బీజేపీ సిద్ధాంతం. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచిది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు ఆడుకుంటుంది అని గుర్తిస్తే మంచిది" అని సూచనలు చేశారు!

Tags:    

Similar News