30 ఏళ్ళకైనా అప్పు కదా చంద్రబాబూ ?

అప్పు ఎపుడూ అప్పే. అది ఎప్పుడూ ఏపీకి భారమే. మరి రాజకీయంగా పండిన చంద్రబాబుకు ఆ విషయం తెలియదా అని అంటున్నారు

Update: 2024-07-23 15:05 GMT

అప్పు ఎపుడూ అప్పే. అది ఎప్పుడూ ఏపీకి భారమే. మరి రాజకీయంగా పండిన చంద్రబాబుకు ఆ విషయం తెలియదా అని అంటున్నారు. దీర్ఘకాలంలో అప్పులు తీర్చుకుందురు గానీ అంటే ఎవరైనా అప్పులు సంతోషంగా చేస్తారా అన్న చర్చ కూడా ఉంది. పోనీ ఏపీ ఏమైనా అప్పులు తక్కువ కలిగిన రాష్ట్రమా అంటే అప్పులు సాక్ష్తాత్తూ 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని టీడీపీ కూటమే చెబుతోంది.

అంత అప్పు ఉంది. ఇంకా చేయాల్సి ఉంది. ఎందుకంటే సంపద సృష్టించడం ఒక్క రోజులో సాగదు కదా. అలా ఏపీ అనేక విషయాల మీద ఎటూ అప్పులు చేస్తూ పోవాల్సిందే. అలాంటిది అమరావతి రాజధాని కట్టడానికి కూడా అప్పులు తెచ్చుకుంటే తడిసి మోపెడు కాదా అని కూడా ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు అయితే అప్పులు అయినా ఏదైనా నిధులు వస్తే చాలు అని అంటున్నారు. ఏపీ అన్ని విధాలుగా ఆర్ధికంగా చితికిపోయిందని కాబట్టి అప్పులు ఇచ్చినా ఓకే అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు అంటున్నారు. పైగా ముప్పయ్యేళ్ల దాకా అప్పులు తీర్చనక్కరలేదు అని కూడా బాబు చెబుతున్నారు.

అక్కడికి ఇదేదో ఊరటను ఇచ్చే విషయంగా ఆయన చెబుతున్నారు. కానీ అప్పు ఎపుడూ గొప్ప కాదు తప్పే అవుతుంది. అందువల్ల అప్పులు కాదు స్పెషల్ గ్రాంట్స్ కోసం కేంద్రం వద్ద టీడీపీ పట్టుబట్టాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది అంటే అది ఏపీలోని 21 మంది ఎంపీల చలవతోనే అని కూడా అంతా గుర్తు చేస్తున్నారు.

పైగా రాజధాని నిర్మాణం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని విభజన చట్టంలో స్పష్టంగా ఉంది. దాంతో విభజన చట్టం మేరకు కేంద్రం అప్పులు చేసి ఏపీకి మాత్రం ఉదారంగా నిధులు ఇవ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో కేంద్రం మీద ఒత్తిడి పెట్టాల్సిందే అని కూడా చెబుతున్నారు.

అయితే చంద్రబాబు చెబుతున్నది చూస్తే కేంద్రం వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే అప్పును తన సొంత పూచీకత్తుతో ఇస్తుందని.అది అప్పు రూపంలో అయినా తీర్చడానికి 30 ఏళ్ళు గడువు ఇచ్చారు కదా అంటున్నారు. మరి ఇది ఏపీకి ఊరటను ఇచ్చే పరిణామంగా కూడా ఆయన చెబుతున్నారు. నిజానికి అమరావతి రాజధాని నిర్మాణం అయితే దాని ద్వారా వచ్చే పన్నులతో ఆదాయం పెరిగి ఏపీ ఆర్ధికంగా పుంజుకుంటుంది అని కదా అంతా భావించేది.

మరి రాజధాని కట్టడానికి అయిన అప్పులనే తీరుస్తూ కూర్చుంటే ఏపీ ఖజానా నిండేది ఎపుడు ఏపీకి ఆర్ధిక సుస్థిరత వచ్చేది ఎపుడు అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కేంద్రం వద్ద నుంచి ఏపీ స్పెషల్ గ్రాంట్స్ నే రాబట్టాలి తప్ప అప్పులను కాదు అప్పులకు వెసులుబాటు కానే కాదు అని అంటున్నారు. గడచిన వైసీపీ ప్రభుత్వంలోనూ అప్పులకు వెసులుబాటు ఇవ్వడం వల్లనే ఏపీ అప్పుల కుప్ప అయింది అని గుర్తు చేస్తున్నారు.

Tags:    

Similar News