ముస్లింలకు భారీ వరాలిచ్చిన బాబు !

టీడీపీ అధినేత చంద్రబాబు భారీ వరాలను ముస్లింలకు ప్రకటించారు. ఇది ఎన్నికల మ్యానిఫేస్టోకి కొనసాగింపు అని భావించాలి.

Update: 2024-05-02 04:03 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు భారీ వరాలను ముస్లింలకు ప్రకటించారు. ఇది ఎన్నికల మ్యానిఫేస్టోకి కొనసాగింపు అని భావించాలి. ఒక్క రోజు ముందు ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన బాబు అందులో ముస్లిం సమాజనికి కొన్ని హామీలు ఇచ్చినా ఎందుకో మళ్లీ వారి కోసం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మరిన్ని హామీలను గుప్పించారు.

ఏకంగా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కూడా కొనసాగేలా కృషి చేస్తామని ప్రకటించారు. ఒక వైపు దేశంలో ముస్లింలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ పెద్దలు మోడీ అమిత్ షా చెబుతున్నారు.

ఏపీలో టీడీపీ బీజేపీ కూటమి కట్టిన తరువాత కూడా చంద్రబాబు ఓపెన్ గా బోల్డ్ గా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం చూసిన వారు అంతా తెర వెనక రాజకీయం ఏదో జరుగుతోంది అని అంటున్నారు. ఈ ఒక్క హామీయే కాదు, ముస్లింలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని బాబు మరో సంచలన ప్రకటన చేశారు. అదే విధంగా హజ్ యాత్రకు వెళ్లే వారికి లక్ష రూపాయలు, అదే విధంగా మైనారిటీ కార్పోరేషన్ ద్వారా ముస్లిం మైనారిటీ వర్గాలకు అయిదు లక్షలు వంతున వడ్డీ లేని రుణాలు అందజేస్తామని కూడా హామీ ఇచ్చారు.

అలాగే నూర్ భాషాలకు కార్పోరేషన్ ఏర్పాటు చేసి వంద కోట్ల రూపాయల మేర ఆర్ధిక సాయం చేస్తామని కూడా చంద్రబాబు ప్రకటించారు. ఇలా పెద్ద ఎత్తున ముస్లింలకు వరాలను బాబు ఇవ్వడం ద్వారా వారిని పూర్తిగా మచ్చిక చేసుకునే పనిలో పడ్డారని అంటున్నారు.

బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి ముస్లిం మైనారిటీ ఓట్లు పడవు అన్న ప్రచారం ఉంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు కొంత ఆలోచన చేస్తూ వచ్చారు. ఇక టీడీపీ కూటమి మ్యానిఫేస్టోకి బీజేపీ దూరంగా ఉండడం కూడా ఆయన ఆలోచనలను మరో వైపు తీసుకునేలా చేసిందా అన్న చర్చ సాగుతోంది. మొత్తం మీద చూస్తే చంద్రబాబు ముస్లిం మైనారిటీ వర్గాలకు ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ ప్రకటించని విధంగా వరాలు ప్రకటించారు. మరి గేమ్ చేంజర్ గా ఈ హామీలు పనిచేస్తాయా అన్న చర్చ అయితే సాగుతోంది.

Tags:    

Similar News