కార్యకర్తలను వదలను.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ముఖ్యంగా జూలై 1న ఇవ్వనున్న పింఛన్ల విషయంపై దిశానిర్దేశం చేశారు.
ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు గడిచిన రెండు రోజులు బిజీబిజీగా ఉన్న విష యం తెలిసిందే. మంత్రులకు శాఖలు కేటాయించడం.. ఐదు కీలక హామీలపై సంతకాలు చేయడం..తనను కలిసేందుకు వచ్చిన వారితో చర్చించడం.. ఇలా ఆయన రెండు రోజులు బిజీగా ఉన్నారు. శనివారం ఉదయం కూడా.. యధావిధిగా సచివాలయంలో ని తన కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా జూలై 1న ఇవ్వనున్న పింఛన్ల విషయంపై దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లపై చర్చించారు.
అనంతరం.. సచివాలయంలోనే భోజనం చేసిన చంద్రబాబు మధ్యాహ్నం 4 గంటల సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. మంగళగిరిలోని హైవే పక్కన ఉన్న ఈ పార్టీ కార్యాలయానికి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి వచ్చిన చంద్రబాబుకు పార్టీ నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అభిమానులు, పార్టీ ముఖ్య నేతలు కూడా.. చంద్రబాబుకు గజమాలలతో స్వాగతం పలికారు. ప్రత్యేకంగా పూలు పరిచిన దారిలో ఆయనను నడిపిస్తూ..ముందుకు సాగారు. అదేవిధంగా కార్యాలయం లోపల.. 4 కేజీల (సీఎంగా ఆయన నాలుగోసారి బాధ్యతలు చేపట్టడానికి గుర్తుగా) కేక్‌ను కట్ చేయించి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడి కృషితోనే పార్టీ ఘన విజయం సాధించిందని తెలిపా రు. ఈ విజయం చిరస్థాయిగా కొనసాగాలంటే.. మరింత ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉంటూ.. కృషి చేయాలని తెలిపారు. ఏ సమస్య వచ్చినా .. పరిష్కరించేందుకు ముఖ్య నాయకులు అందుబాటులో ఉంటారని చెప్పారు. తాను కూడా.. ఇక నుంచి ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ప్రతి శనివారం.. పార్టీ కార్యాలయానికి వస్తానని.. పార్టీకి కార్యకర్తలే వెన్నెముకలని తేల్చ చెప్పారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని చంద్రబాబు తెలిపారు. ముఖ్య నాయకులు అందరూ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.
ఇదేసమయంలో మంత్రులను ఉద్దేశించి కూడా చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ప్రతి మంత్రీ తమ తమ శాఖలను నిర్వ హించడంతోపాటు.. తమ జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలకు తరచుగా వెళ్లాలని సూచించారు. ఎంత బిజీగా ఉన్నా.. పార్టీ నాయకు లు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. సమస్య ఏదైనా పరిష్కరించేందుకు ప్రయత్నించాలని సూచించారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కృషితోనే మంత్రులుగా చేసే అవకాశం వచ్చిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు కోరారు. ఈ విషయంలో ఏమరు పాటు వద్దని ఆయన తెలిపారు.
కొసమెరుపు ఏంటంటే.. గతంలో మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భాల్లో చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి రాలేదన్న విమర్శలు వున్నాయి. నాయకులను కూడా పట్టించుకోకుండా.. కేవలం పాలనకే సమయం కేటాయించారన్న వాదన కూడా ఉంది. దీంతో పార్టీకి ఆయనకు తర్వాత కాలంలో దూరం పెరిగింది. ఇప్పుడు ఆ గ్యాప్ రాకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.