బాబుకు 'బీహార్' బెంగ... విషయం సీరియస్సే..!
అయినా వీటికి కూడా పోరాటం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రం ముందు మాకే సాయం చేయాలి.. అని నిబంధనలు పెడుతుండడం.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఏ శాఖను చూసినా నిధులు కనిపించడం లేదు. వాస్తవానికి ఆదాయం తెచ్చి పెట్టే శాఖలో రెవిన్యూ అత్యంత కీలకమైంది. నిత్యం కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందుతాయి. ఇక ఖర్చే తప్ప ఆదాయం లేని శాఖలో హోం శాఖ, అగ్నిమాపక శాఖ, వ్యవసాయం వంటివి ఉన్నాయి. వీటికి ఆదాయం లేదు. పోనీ ఆదాయం ఉన్న శాఖలను చూసినా రెవిన్యూ శాఖలో చాలా చాలా తక్కువగానే ఆదాయం కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితి చేతులు కాళ్లు కట్టేసి ముందుకు పరిగెట్టాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది.
దీంతో ఏం పని చేయాలన్న నిధుల సమస్య వెంటాడుతోంది. మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఉన్నప్పటికీ ఉదారంగా నిధులు ఇచ్చే పరిస్థితి కూడా కనిపించట్లేదు. అదే విధంగా ఇతర రాష్ట్రాలు కూడా నిధుల కోసం కేంద్రంపై ఆధారపడి ఉన్నాయి. దీనిని బట్టి చంద్రబాబు ఆశిస్తున్నట్టుగా ఉదారంగా కేంద్రం సహాయం చేసే అవకాశం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే కీలకమైన ప్రాజెక్టులకు మాత్రం కొంత కేంద్రం సహాయంతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. పోలవరం, అమరావతి అదేవిధంగా వెనకబడిన జిల్లాలకు నిధులు వంటివి కొంత మేరకు సాధించే అవకాశం ఉంది.
అయినా వీటికి కూడా పోరాటం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రం ముందు మాకే సాయం చేయాలి.. అని నిబంధనలు పెడుతుండడం. 12 మంది ఎంపీలు ఉన్నారు. వీరు మోడీకి మద్దతిస్తున్నారు. అయితే.. ఈ క్షణంలో ఎలా వ్యవహరిస్తారో తెలియని ఒక రాజకీయ సంక్లిష్ట వాతావరణం కేంద్రంలో ఉండడం ఏపీ పై ప్రభావం కనిపించేలా చేస్తోంది. దీంతో ఆర్థికంగా సొంత వనరులను సృష్టించుకోవాల్సిన అవసరం ఇప్పుడు చంద్రబాబు మీద ఉంది.
మరోవైపు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు తరుముకొస్తున్నాయి. వీటిపై ఇప్పటికే సజ్జల రామకృష్ణా రెడ్డి వంటి వారు విమర్శలు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు అయింది.. ఇంకా పథకాల విషయంలో ఏం చేయట్లేదు.. పథకాలను ప్రస్తావించడం లేదు.. ఆయా పథకాలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా విమర్శలు గుర్తించారు. అమలు చేద్దాం అంటే ఆర్థికంగా ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం పై విమర్శలు చేద్దామన్నా అన్ని తెలిసే మీరు హామీలు ఇచ్చారు. అన్నీ తెలుసు కాబట్టి మేము హామీలు ఇవ్వలేదు అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురు దాడి మొదలవుతుంది.
దీనిని బట్టి రాష్ట్రంలో తక్షణ కర్తవ్యం ఆదాయాన్ని పెంచుకోవడమే, కానీ ఇప్పుడు అవలంబించి నటువంటి రెండు కీలక విధానాల్లో ప్రభుత్వానికి ఆదాయం మరింత తగ్గుతుంది. ఇసుక మీద ఎంతో ఆదాయం వచ్చినటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టారు. తద్వారా రెవిన్యూ తగ్గింది. అదే విధంగా రెవెన్యూ ఆదాయం కూడా మునుముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో తక్షణ ఆదాయం సమకూరే మార్గాలపై చంద్రబాబు దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల నుంచి ఆయన గట్టెక్కే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.