ఎఫ్.బీ.ఐ. టాప్-10 మోస్ట్ వాంటెడ్ లో భారతీయుడు... ఎవరీ పటేల్?
ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) కి సంబంధించిన టాప్-10 మోస్ట్ వాంటెడ్ జాబితాలో తాజాగా ఓ భారతీయుడు చేరాడు.
ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) కి సంబంధించిన టాప్-10 మోస్ట్ వాంటెడ్ లో తాజాగా ఓ భారతీయుడు చేరడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇతడిపై ఎఫ్.బీ.ఐ. భారీ రివార్డునే ప్రకటించింది. అతడు అమెరికా, కెనడా, భారత్ లలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... ఎవరీ భారతీయుడు, ఎందుకు ఎఫ్.బీ.ఐ. కి టార్గెట్ అయ్యాడు అనేది ఇప్పుడు చూద్దామ్..!
అవును... ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ) కి సంబంధించిన టాప్-10 మోస్ట్ వాంటెడ్ జాబితాలో తాజాగా ఓ భారతీయుడు చేరాడు. అతడి పేరు భద్రేష్ కుమార్ చేతన్ భాయ్ పటేల్. ఇతడి వయసు 34 ఏళ్లు కాగా.. 2015 ఏప్రిల్ లో మేరీల్యాండ్ లో తన భార్యను హత్య చేసిన కేసులో ఇతడు ప్రధాన నిందితుడు. అప్పటి నుంచి అమెరికా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నాడు!
దీంతో... ఇతడి ఆచూకీ తెలిపిన వారికి ఫెడరల్ ఏజెన్సీ 2,50,000 డాలర్లు (సుమారు 2.16 కోట్ల రూపాయలు) రివార్డ్ ను ఆఫర్ చేసింది.
కేసు ఏమిటి?:
గుజరాత్ లో జన్మించిన చేతన్ భాయ్ పటేల్.. తన భార్య పాలక్ (21) తో కలిసి మేరీల్యాండ్ లోని డొనట్ షాపులో పనిచేసేవాడు. ఈ క్రమంలో 2015 ఏప్రిల్ లో ఇద్దరూ పనిలో ఉన్న సమయంలోనే ఓ వస్తువుతో ఆమెను పలుమార్లు కొట్టి హత్య చేశాడు. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. అతడు పరారీలో ఉన్నాడు. దీంతో... అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయబడింది.
ఈ విషయాలపై స్పందించిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బాల్టిమోర్ విభాగానికి చెందిన స్పెషల్ ఏజెంట్ నోనాథన్ షాపర్ ఆమె తిరిగి భారత్ వెళ్లాలని కోరికను వ్యక్తం చేశారని.. అది పటేల్ కు నచ్చలేదని.. తిరిగి భారత్ కు వెళ్లిపోతే పరువు పోతుందని అతను భావించే అవకాశం ఉందని.. ఇదే సమయంలో ఆమెను విడిచి పెట్టి ఉండటం అతనికి ఇష్టం లేదని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
అయితే.. ఆమెను హత్య చేసిన తర్వాత పటేల్ అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో.. అధికారులు చాలా రోజుల తర్వాత ఫెడరల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ సమయంలో అతడు అమెరికాలోని బంధువుల వద్ద దాక్కుని ఉండోచ్చు.. లేదా, కెనడా పారీపోయి ఉండొచ్చు.. అదీగాకపోతే, తిరిగి భారత్ కు వచ్చి ఉండొచ్చని ఎఫ్.బీ.ఐ. అనుమానిస్తుంది.
ఈ నేపథ్యంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని తాజాగా పటేల్ ను సంభోధించిన ఎఫ్.బీ.ఐ. అతని గురించి ఏదైనా సమాచారం ఉంటే ఇవ్వాలని ప్రజలను కోరుతూ.. రూ.2.16 కోట్లు రివార్డ్ ప్రకటించింది.