దలాల్ స్ట్రీట్ కు వైరస్ కుదుపు ఒక్కరోజులోనే రూ.12 లక్షల కోట్లు ఆవిరి
ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటి వరకు లాభనష్టాలతో కొనసాగిన సూచీలు దేశంలో మూడు కేసులు నమోదయ్యాయనే వార్తలో అమాంతంగా పడిపోయాయి.
చైనా వైరస్ దెబ్బ స్టాక్ మార్కెట్లను వణికించింది. దేశంలోనూ మూడు కేసులు నమోదయ్యాయనే సమాచారంతో బడాబడా కంపెనీల షేర్లు కూడా కుప్పకూలాయి. దీంతో సోమవారం మార్కెట్ ప్రారంభమైన కొద్ది సేపటికే సూచీలు భారీగా పడిపోయాయి. ఫలితంగా మదుమర్లు ఒక్క రోజులోనూ రూ.12 లక్షల కోట్లు కోల్పోవాల్సివచ్చింది.
చైనా వైరస్ హెచ్ఎంపీవీ గుబులతో దలాల్ మార్కెట్ సోమవారం భారీగా పతనమైంది. ఉదయం మార్కెట్ ప్రారంభమైన కొద్దిసేపటి వరకు లాభనష్టాలతో కొనసాగిన సూచీలు దేశంలో మూడు కేసులు నమోదయ్యాయనే వార్తలో అమాంతంగా పడిపోయాయి. మరోవైపు ఆసియా మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాల ఒత్తిడితో మొత్తం మార్కెట్ విలువ రూ.12 లక్షల కోట్ల మేర క్షీణించింది.
ఇంట్రాడేలో సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర పతనం అవ్వగా, నిఫ్టీ 23,550 పాయింట్ల స్థాయికి చేరింది. ఉదయం సెన్సెక్స్ 79,281.65 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. ఆ వెంటనే బెంగళూరులో రెండు, గుజరాత్ లో ఒకటి చొప్పున వైరస్ కేసులు నమోదయ్యాయని తెలియగానే సూచీల పతనం మొదలైంది. క్షణాల్లోనే భారీ నష్టాల్లోకి జారుకున్న షేర్లు మదుపర్లను మంచేశాయి. ఇంట్రాడేలో 77,781.62 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సూచి, చివరికి 1258.12 పాయింట్ల నష్టంతో 77,964.99 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 388.70 పాయింట్లు నష్టపోయి 23,616.05 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం మరో మూడు పైసలు క్ణీణించింది.
సెన్సెక్స్ 30 సూచీలో టైటాన్, సన్ ఫార్మా షేర్లు మినహా మిగిలిన అన్ని కంపెనీలు నష్టపోయాయి. టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. HDFC బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, టాటా స్టీల్ వంటి అధిక వెయిటేజీ స్టాక్స్ కూడా అమ్మకాల ఒత్తిడి సూచీల పతనానికి కారణమయ్యాయి. వైరస్ భయంతోపాటు మరికొద్ది రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకోబోతుండటం, చైనా సహా మరి కొన్ని దేశాలపై టారీఫ్ భయం వెంటాడుతోంది. దీంతో జపాన్ నిక్కీ, హాంకాంగ్, షాంఘై మార్కెట్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి.