'పేట'లో జగన్ పార్టీని నడిపించే 'జగ్గయ్య' ఎవరో?
అయితే, ఆరు నెలల కిందట ఎన్నికలు జరిగిన ఏపీలో ఈ పేటలో వైసీపీ ఓడిపోయింది.
సూళ్లూరుపేట.. చిలకలూరిపేట.. జగ్గంపేట.. రాజంపేట.. నరసన్నపేట.. నరసరావుపేట.. కొత్తపేట.. మండపేట.. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు...? పోనీ ఒక్క విషయం గమనించారా? ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లోని నియోజకవర్గాల పేర్లు.. ఈ ఎనిమిది నియోజకవర్గాలే కాక ఏపీలో మరో ‘పేట’ కూడా ఉంది.. అదేమిటో మీరే ఊహించాలి. అయితే, ఆరు నెలల కిందట ఎన్నికలు జరిగిన ఏపీలో ఈ పేటలో వైసీపీ ఓడిపోయింది. దక్కింది మొత్తం 11 సీట్లే. గెలిచింది ఒక్క పేటలోనే. అది రాజంపేట. వీటన్నిటిలోనూ లేనిది ఓడిపోయిన ఓ పేటలో మాత్రం ఉంది. అదే నాయకత్వ సమస్య.
నా అనుకున్న నాయకుడే..
వైసీపీకి ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మొదటినుంచి కీలక నాయకుడు సామినేని ఉదయ భాను. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉయయభాను వైఎస్ హయాం నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినా అందులో చేరలేదు. ప్రజారాజ్యం కారణంగానే 2009 ఎన్నికల్లో ఉదయ భాను ఓడిపోయారని చెప్పాలి. ఇక వైఎస్ మరణం అనంతరం ఆయన పూర్తిగా జగన్ వెంటనే నడిచారు. 2014లో ఓడిపోయినా 2019లో ఘన విజయం సాధించారు. మొత్తమ్మీద 1999, 2004లో గెలిచి.. 2009, 2014, 2024లో పరాజయం ఎదుర్కొన్నారు. ఈ మూడు సార్లూ టీడీపీకి చెందిన శ్రీరాం తాతయ్య చేతిలో ఓడిపోయారు. అయితే, గత ఎన్నికల్లో గెలిచినా, ఓడినా కాంగ్రెస్, వైసీపీలను వీడని ఆయన ఈసారి మాత్రం జనసేన గూటికి చేరారు.
ఇద్దరూ ఒకే ఒరలో..
ఇప్పుడు జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇద్దరూ అధికార ఎన్డీఏ కూటిమిలోనే ఉన్నట్లయింది. టీడీపీ-జనసేన పొత్తు మరో ఎన్నికల వరకైనా ఉంటుందని భావిస్తున్నారు. అదే జరిగితే మరి వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏమిటో చూడాలి. ఇక 1999, 2004లో నెగ్గిన టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం ప్రస్తుతం క్రియాశీలంగా లేరు. మరోవైపు సామినేని ఉదయ భాను పార్టీని వీడడంతో వైసీపీ నాయకత్వం ఖాళీ అయింది.
ఈ ఇద్దరిలో ఎవరికో?
వైసీపీకి జగ్గయ్యపేటలో కీలక నాయకుడు ఇంటూరి చిన్నా (రాజగోపాల్). వ్యక్తిగతంగానూ బలమైన నాయకుడు ఈయన. మాస్ లీడర్ గా చిన్నాకు తిరుగులేని ఇమేజ్ ఉంది. వాస్తవానికి ఇన్నాళ్లూ ఉదయభాను వెనుక ఉన్నది చిన్నానే అంటారు. కోఆపరేటివ్ బ్యాంక్ నేపథ్యం ఉన్న మరో నాయకుడు తన్నీరు నాగేశ్వరరావు కూడా పార్టీకి విధేయులే. అయితే, మాస్ లీడర్ కాదు. కాగా, జగ్గయ్యపేటలో నెట్టెం రఘురాం తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఎవరూ ఎమ్మెల్యే కాలేదు. 20 ఏళ్లుగా భాను (కాపు), తాతయ్య (కోమటి) మధ్యనే గెలుపోటములు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చూసినా కమ్మ సామాజిక వర్గానికి చెందిన చిన్నా, తన్నీరు నాగేశ్వరరావులకు మంచి చాన్స్ దక్కినట్లే. వైసీపీ అధినేత కూడా ఇదే దిశగా ఆలోచించి కమ్మ సామాజిక వర్గానికి జగ్గయ్యపేట పగ్గాలు అప్పగిస్తే.. ఆ పార్టీకి మేలు అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే జగ్గయ్యపేటలో 60 వేలకు పైగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కాబట్టి. మరి జగన్ నిర్ణయం ఏమిటో?