పవన్ లోకేష్ జగన్ మధ్యనే పోటీ...డిసైడ్ చేశారా ?

మొత్తం మీద చూస్తే చంద్రబాబు ఈ అయిదేళ్లలో తాను చేయాలనుకున్న అనేక కార్యక్రమాలు చేసి అమరావతి పోలవరం వంటి వాటిని నెరవేర్చి పార్టీ పగ్గాలను లోకేష్ ని అప్పగిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.

Update: 2025-01-08 03:00 GMT

సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడు నెలలు అయింది. అపుడే 2029 ఎన్నికల గురించి అంతా ఆలోచిస్తున్నారు. ఈ తొందర రాజకీయ పార్టీల కంటే రాజ గురువులమని చెప్పుకుంటున్న కొందరు మీడియా అధిపతులకే ఎక్కువగా ఉంది అంటున్నారు. టీడీపీకి అనుకూల మీడియాగా పేరు తెచ్చుకున్న ఒక సంస్థ అయితే 2029 ఎన్నికల గురించి ఇప్పటి నుంచే టీడీపీ అధినాయకత్వాన్ని అలెర్ట్ చేస్తోంది.

వచ్చే ఎన్నికల నాటికి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వయసు ఎనభైకి చేరువ అవుతుంది కాబట్టి టీడీపీ పగ్గాలు లోకేష్ చేతికి వస్తాయని అంచనా వేస్తోంది. అదే సమయంలో వైసీపీ అధినేత ఎటూ విపక్షంలో ప్రధాన పోటీగా ఉంటారని విశ్లేషిస్తున్నారు.

ఇక జగన్ ఆల్రెడీ ప్రూవ్ అయిన పొలిటీషియన్ అని అంటున్నారు. ఆయనకు కొన్ని వర్గాల మద్దతు ఇప్పటికీ ఉందని అందుకే 2024 ఎన్నికల్లో 40 శాతం ఓటింగ్ వచ్చిదని చెబుతున్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ జనసేన కూడా 2024 ఎన్నికల తర్వాత బలపడిందని ఆ పార్టీకి కోస్తా జిల్లాలలో ఒక బలమైన సామాజిక వర్గం దన్ను ఉందని పవన్ కూడా రాజకీయంగా తన స్థానాన్ని బలపరచుకుంటున్నారని పేర్కొంటోంది.

ఈ నేపధ్యంలో పవన్ అండ్ జగన్ ఈ ఇద్దరితో లోకేష్ కి పోలిక తెస్తూ ఆయన ఇంకా తనను రుజువు చేసుకోవాల్సి ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నారు. లోకేష్ యువగళం పాదయాత్ర చేసినా ఆయనకు సొంత ఇమేజ్ ఇంకా రావాల్సి ఉందని అంటున్నారు.

ఇక చంద్రబాబు పొలిటికల్ గా టవరింగ్ పర్సనాలిటీ. ఆయనకు సాటి పోటీ వచ్చే వారూ ఎవరూ లేరు. ఆయన దేశ రాజకీయాల్లోనే కీలకమైన నాయకుడిగా ఉన్నారు. లోకేష్ కి ఆ తండ్రి వారసత్వం అన్నది బరువైనదిగా మారుతోంది అంటున్నారు

చంద్రబాబు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లుగా లోకేష్ నుంచి కూడా ఆశిస్తారు అని ఆ విధంగా బలమైన నాయకత్వం చొరవ లోకేష్ చూపించాలి అంటే మరింత కష్టపడాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. అదే విధంగా చూస్తే లోకేష్ ఇంకా చంద్రబాబు నీడలోనే ఉన్నారన్న భావన ఉందని అంటున్నారు.

ఆయన తనను తాను సొంతంగా రుజువు చేసుకునే అవకాశాలు వస్తే తప్ప ఆయన నాయకత్వ ప్రతిభ పూర్తి స్థాయిలో బయటపడకపోవచ్చు అంటున్నారు.ఏది ఏమైనా టీడీపీ పది కాలాల పాటు ఉండాలని సలహాలూ సూచనలు ఇచ్చే అనుకూల మీడియా మాత్రం లోకేష్ ఇంకా రాణించాలని కోరుకుంటోంది.

ఒక వైపు సీఎం గా అయిదేళ్ల పాటు చేసిన జగన్ అలాగే సొంత పార్టీ పెట్టుకుని డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగిన పవన్ ఉన్న సమయంలో వారికి ధీటైన ప్రత్యర్ధిగా లోకేష్ వచ్చే ఎన్నికల నాటికి తయారు కావాలీ అంటే ఈ రోజు నుంచి ఆయన తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకోవాలని అంటోంది. అదే విధంగా ఆయనకు మరింత ఫ్రీ హ్యాండ్ కూడా టీడీపీలో ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని కూడా సూచనలు వస్తున్నాయి.

మొత్తం మీద చూస్తే చంద్రబాబు ఈ అయిదేళ్లలో తాను చేయాలనుకున్న అనేక కార్యక్రమాలు చేసి అమరావతి పోలవరం వంటి వాటిని నెరవేర్చి పార్టీ పగ్గాలను లోకేష్ ని అప్పగిస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఎందుకంటే టీడీపీ అనుకూల మీడియా నుంచి వస్తున్న సంకేతాలు చూస్తే 2029 పోటీలో చంద్రబాబు బదులుగా లోకేష్ నే ముందు పెట్టారు. దాంతో ఈసారి ఏపీలో జరిగే ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో వాస్తవాలు ఏమిటో.

Tags:    

Similar News