తల్లి కాంగ్రెస్ లో చెల్లి కాంగ్రెస్ విలీనం.. వెటకారం

కాంగ్రెస్ ది 125 ఏళ్లపైగా చరిత్ర. ప్రపంచంలోనే అతి పురాతన పార్టీ అని చెప్పక తప్పదు. అలాంటి కాంగ్రెస్ నుంచి అనేక పార్టీలు పుట్టాయి

Update: 2024-01-05 06:53 GMT

తెలుగు రాష్ట్రాల రాజకీయ తెరపై నుంచి మరో పార్టీ తెరమరుగైంది. గత పదిహేనేళ్లలో చూస్తే.. కీలక వ్యక్తులు స్థాపించిన మూడో పార్టీ విలీనం రూపంలో అంతర్థానమైంది. 2008లో మెగాస్టార్ చిరంజీవి నెలకొల్పిన ప్రజారాజ్యం, మాజీ మంతర్ దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీల తరహాలోనే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైటీపీ) కూడా కనుమరుగైంది. నవ తెలంగాణ పార్టీ ప్రజారాజ్యంలో కలవగా.. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైంది. ఇప్పుడు వైటీపీ సైతం కాంగ్రెస్ లోకే వెళ్లిపోయింది.

ఒక కాంగ్రెస్ .. వంద పార్టీలు

కాంగ్రెస్ ది 125 ఏళ్లపైగా చరిత్ర. ప్రపంచంలోనే అతి పురాతన పార్టీ అని చెప్పక తప్పదు. అలాంటి కాంగ్రెస్ నుంచి అనేక పార్టీలు పుట్టాయి. కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన వారు స్థాపించిన పార్టీలు ఇప్పుడు ఏపీ, ఒడిశా, బెంగాల్ వంటి పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయంటేనే ఆ పార్టీ ఎంతటి మహా సముద్రమో తెలుస్తోంది. శరద్ పవార్, మమతా బెనర్జీ, వైఎస్ జగన్ వంటి రాజకీయ దిగ్గజాలు ఒకప్పుడు కాంగ్రెస్ వారే. ఇలా చెప్పుకొంటూ పోతే బోలెడు మంది నాయకులు, పార్టీలు వస్తాయి. ఆఖరికి మారీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సైతం ఓ దశలో కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయి సొంత పార్టీ పెట్టుకుని మళ్లీ సొంత గూటికి వచ్చారు. ఇలా ఎవరు వచ్చినా తనలో కలుపుకొనేంత స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఉంటుందనడంలో సందేహం లేదు.

అనేక పార్టీలకు మూలం

దేశంలో అనేక పార్టీలకు కాంగ్రెస్సే మూలం. ఇందులో పనిచేసి బయటకు వెళ్లిన కొందరు సొంతంగా పార్టీలు పెట్టుకుని నిలదొక్కుకున్నారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వంటి వారు సీఎంలూ అయ్యారు. శరద్ పవార్ వంటివారు తీవ్రంగా విభేదించి మళ్లీ పొత్తుపెట్టుకున్నారు. కాగా, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తో విభేదించిన వైఎస్ జగన్ సొంతంగా పార్టీ పెట్టుకున్న సందర్భంలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ విమర్శలు చేసేవారు. రెండున్నరేళ్ల కిందట జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి తాజా కాంగ్రెస్ లో విలీనం చేసిన నేపథ్యంలో తల్లి కాంగ్రెస్ లో చెల్లి కాంగ్రెస్ విలీనమైందంటూ వెటకారం చేస్తున్నారు.

వైసీపీ విలీనం ప్రసక్తే లేదు

వైటీపీని పక్కనపెడితే.. జగన్ సారథ్యంలోని వైసీపీ మాత్రం ఎప్పటికీ కాంగ్రెస్ లో కలవదనే చెప్పాలి. అసలు ఏపీలో కాంగ్రెస్సే లేదు. కనీసం రాజధాని కూడ లేకుండా చేసిన అడ్డగోలు విభజన పాపానికి ఆ పార్టీ మరో వందేళ్లయినా ఏపీలో గెలిచే అవకాశం లేదు. అలాంటిచోట కాంగ్రెస్ లోకి ఎవరు వెళ్లినా ఆఖరుకు జగన్ వెళ్లినా నిష్ప్రయోజనమే. కాంగ్రెస్ ఏం చేసినా ఏపీ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఇక జగన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే తన పార్టీని ఎందుకు వదులుకుంటారు? అంటే.. ఏపీలో ఇప్పుడైనా ఎప్పుడైనా ఢీకొనేది వైసీపీ, టీడీపీ కూటమే అని చెప్పక తప్పదు.

Tags:    

Similar News