రాహుల్, ప్రియాంకా వారిద్దరిని ఓడిస్తే కాంగ్రెస్ కి 400 సీట్లే...!

అంతటి ప్రభజనం కాంగ్రెస్ కి వీస్తుందా. అంత బలంగా కాంగ్రెస్ ఇపుడు ఉందా, అంతటి ఘనమైన నాయకులు ఉన్నారా.

Update: 2023-08-20 02:45 GMT

వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఇంటి దగ్గర జాతీయ జెండా ఎగరేస్తారని, ఆయన ఎర్ర కోట మీద జెండా వందనానికి ప్రధాని హోదాలో రాలేరని మూడు రోజుల క్రితం కాంగ్రెస్ జాతీయ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఘాటుగా విమర్శించారు. ఇక కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిందని, కేంద్రంలో మోడీ సర్కార్ ఓటమితో పాటు ఇండియా కూటమి అధికారంలోకి రావడం తధ్యమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

ఒక విధనగ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహంతో మోడీనే ఓడిస్తామని అంటున్నారు. యూపీలోని వారణాసి నుంచి నరేంద్ర మోడీ మీద కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ పోటీ చేస్తే కచ్చితంగా ఓడించి తీరుతారు అని జోస్యం చెబుతున్నారు. అలాగే రాహుల్ గాంధీ అమేధీ నుంచి ఈసారి పోటీ చేసి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఓడిస్తారని అంటున్నారు.

నిజంగా ఈ రెండూ జరిగితే మాత్రం ఇండియా కూటమి అవసరం లేదు, మరేదీ అవసరం లేదు, 1984లో కాంగ్రెస్ కి రాజీవ్ గాంధీ నాయకత్వంలో వచ్చినట్లుగా 400 పైబడి ఎంపీ సీట్లు డ్యాం ష్యూర్ గా దక్కుతాయని అంటున్నారు. నిజంగా కాంగ్రెస్ కి విజయం మీద అంత ధీమా ఉంటే పొత్తులు ఎందుకు ఇండియా కూటమి పేరిట విపక్షాలను కలుపుకోవడం ఎందుకు అన్న ప్రశ్న కూడా ముందుకు వస్తోంది.

కాంగ్రెస్ పార్టీ గతం కంటే 2024లో బాగా పుంజుకుంటోంది. అది అందరికీ తెలిసిందే. అంతమాత్రం చేత కాంగ్రెస్ సొంతంగా 200 మార్క్ ఎంపీ సీట్లను దాటుతుందని ఎవరూ చెప్పడంలేదు. కాంగ్రెస్ కి ప్రస్తుతం పార్లమెంట్ లో 56 సీట్ల దాకా ఉన్నాయి. అవి రెట్టింపు కావచ్చు అని అంటున్నారు. అంటే కాంగ్రెస్ కి వంద దాకా సీట్లు వస్తాయని అంచనా కడుతున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు అంటున్నట్లుగా రాహుల్ గాంధీ ఈసారి అమేధీలో గెలిచినా గెలవవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి అది ఆ కుటుంబానికి గట్టిగా ఉన్న సీటు.

కానీ 2019 ఎన్నికల్లో రాహుల్ అతి ధీమా వల్లనో బీజేపీకి ఉన్న వేవ్ వల్లనో ఓడిపోయారు. పైగా రాహుల్ కే డౌట్ వచ్చినట్లుగా కేరళలోని మరో సీటుకు పోటీ చేశారు. దాంతో అమేధీలో ఆయన ఓటమి అనివార్యం అయింది. ఈసారి ఆయన అమేధీ ఒక్కటే సీటు అని పోటీ చేస్తే బీజేపీ సర్కార్ మీద ఉన్న యాంటీ ఇంకెంబెన్సీ కూడా దోహదం అయి గెలవవచ్చు.

అయితే వారణాసిలో ప్రియాంకా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీని ఓడిస్తామనడం అంటే అది అసలు కుదరని వ్యవహారమే అంటున్నారు. మోడీకి అజేయుడు అని పేరు ఉంది. అసలు ఆయన పేరు మీదనే కేంద్రంలోని బీజేపీ మూడవ సారి ఎన్నికలకు వెళ్తోంది. మోడీ గ్రాఫ్ బాగుంటే మళ్లీ 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేద్దమని అనుకుంటోంది. అలాంటిది మోడీయే ఓడిపోతారనుకుంటే ఇక బీజేపీకి 1984లో వచ్చినట్లుగా ఏ రెండో సీట్లు వచ్చి ఆగిపోతాయి.

అంతటి ప్రభజనం కాంగ్రెస్ కి వీస్తుందా. అంత బలంగా కాంగ్రెస్ ఇపుడు ఉందా, అంతటి ఘనమైన నాయకులు ఉన్నారా. అన్నింటికీ మించి రాహుల్ గాంధీ నాయకత్వం మీద ప్రజలలో అంతలా నమ్మకం పెరుగుతోందా అన్నవన్నీ వరసగా వచ్చే ప్రశ్నలే. ఏది ఏమైనా కాంగ్రెస్ నేతలు జోరు మీద ఉన్నారు. మోడీనే ఓడిస్తామని అంటున్నారు.

ఈ హుషార్ మంచిదే దీని వల్ల కాంగ్రెస్ సీట్లు పెరుగుతాయి. గెలుపు ఆశలు కూడా ఎక్కువ అవుతాయి. అయితే 1984 మాదిరిగా కాంగ్రెస్ అప్రతిహత విజయాలు సాధించే కాలం మాత్రం ఇది కాదు, అది మళ్లీ రాదు అని గట్టిగా చెప్పవచ్చు. సో మోడీని ఓడిస్తామని అనడం కంటే ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు పూర్తి మెజారిటీ ఇవ్వండి అని ప్రజలను కాంగ్రెస్ కోరడం భేషైన నిర్ణయమేమో.

Tags:    

Similar News