కొత్త సంకేతం: రేవంత్ రెడ్డికి పెరిగిన భద్రత... !
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 9న ప్రమాణ స్వీకారం చేస్తుంది అని నేతలు ప్రకటనలు ఇస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 9న ప్రమాణ స్వీకారం చేస్తుంది అని నేతలు ప్రకటనలు ఇస్తున్నారు. ఇంతకీ తెర వెనక ఉన్న ఆ ముఖ్యమంత్రి పేరు ఏమిటి అంటే డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాక అన్నీ ఆలోచించుకుని హై కమాండ్ డిసైడ్ అవుతుంది అని అంటున్నారు.
అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. అంతే కాదు మొత్తం 119 సీట్లలో అత్యధిక శాతం సీట్లలో రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఆయన రెండు చోట్ల పోటీ చేస్తూ కూడా కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రచారం కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగారు.
ఇక ఆయన తెలంగాణాలో స్టార్ కాంపెయినర్ గా ఉన్నారు. ప్రజాకర్షణ కలిగిన నేతగా వాగ్ధాటి కలిగిన నాయకునిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంతో ఆయన కాబోయే సీఎం అని ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి. అయితే కాంగ్రెస్ లో చాలా మంది నాయకులు రేసులో ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గురించి ఎవరూ చెప్పడంలేదు.
అయితే కాంగ్రెస్ కి మంచి మెజారిటీ దక్కితే మాత్రం రెండవ ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డి పేరునే ప్రకటిస్తారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయంతో సంబంధం లేకుండానే రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత ఒక్క సారిగా పెంచేసారు.
ఎగ్జిట్ పోల్స్ సర్వేల నేపధ్యంలో రేవంత్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వెల్లువలా వస్తున్నారు. అదే విధంగా ఈ నెల 3న ఫలితాలు వచ్చిన తరువాత పూర్తిగా జన సందోహంగా ఆయన నివాసం మారుతుందని ముందే ఊహించి భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటున్నారు.
దీంతో ఒక్కసారిగా రేవంత్ రెడ్డి హోదా పెరిగింది అని అంటున్నారు. కాబోయే సీఎం ఆయనేనా అన్న చర్చకు తెర లేచింది. అలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత పెంచారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియగానే ఈ పరిణామం చోటు చేసుకుంది.
అలాగే అన్ని ఎగ్జిట్ పోల్స్‌లోనూ కాంగ్రెస్ పార్టీదే అధికారమని తేలింది. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డే సీఎం అభ్యర్ధి అనే ప్రచారం జరుగుతూ వుండట వల్ల కూడా భద్రత పెంచేశారు అని అంటున్నారు. ఇక కీలక నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తూ వుండటంతో ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఆయన ఇంటికి భద్రత పెంచినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి రేవంత్ రెడ్డి ని నిన్నటి మాదిరిగా ఈ రోజు కలవడం కుదరదు అని అంటున్నారు. ఆయన అపుడే భద్రతా వలయంలోకి వెళ్లిపోయారు అని అంటున్నారు. మరి అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మాత్రం రేవంత్ రెడ్డి తరువాత సీఎం గా ప్రమాణం చేయడం ఖాయమని అంటున్నారు.