2020 జనవరిలో కొవిడ్.. 2025 జనవరిలో హెచ్ఎంపీవీ.. సేమ్ టు సేమ్

చైనాలో వాస్తవానికి ఈ వైరస్ 2019లోనే వెలుగుచూసినా, భారత దేశంలోకి ప్రవేశించింది మాత్రం 2020 జనవరిలోనే.

Update: 2025-01-06 15:30 GMT

సరిగ్గా ఐదేళ్ల కిందట కొవిడ్-19 మొదలైంది. చైనాలో వాస్తవానికి ఈ వైరస్ 2019లోనే వెలుగుచూసినా, భారత దేశంలోకి ప్రవేశించింది మాత్రం 2020 జనవరిలోనే. ఆ ఏడాది జనవరి 30న భారత్ లో తొలి కొవిడ్ కేసు నమోదైంది. ఇక ఆ తర్వాత అందరికీ తెలిసిన కథే. 2020 మార్చి 22 నుంచి లాక్ డౌన్ ల పర్వం మొదలైంది. ఈ క్రమంలో ప్రజల్లో అనేక భయాలు, ఆందోళనలు. చివరకు కొవిడ్ 2021 మార్చి నుంచి కొత్త రూపం తీసుకుంది. భారత్ లో పుట్టిన డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకరంగా మారి లక్షల ప్రాణాలు బలిగొంది.

మళ్లీ ఇప్పుడు..

2025 జనవరి వచ్చింది.. వస్తూ వస్తూనే కొత్త వైరస్ కలకలం రేపుతోంది. అప్పట్లో కొవిడ్ లాగానే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ కూడా చైనాలోనే పుట్టింది. దీనిలో కూడా కొవిడ్ తరహాలోనే.. ఫ్లూ, ఇతర శ్వాస కోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలు ఉన్నాయి. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస ఇబ్బంది కనిపిస్తున్నాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే బ్రాంకైటిస్, న్యుమోనియాకూ దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. వ్యాధి లక్షణాలు బయట పడేందుకు 3 నుంచి 6 రోజులు పడుతోంది.

తొలి కేసు బెంగళూరులో..

హెచ్ఎంపీవీ తొలి కేసు కర్ణాటకలో బయటపడింది. ఈ రాష్ట్రంలో రెండు కేసులు నమోదయ్యాయి. వీరెవరికీ ట్రావెల్ హిస్టరీ లేదు. ఇక గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్ లో మూడో కేసు నమోదైంది. బెంగళూరులో బాధితులు 3, 8 నెలల వయసున్న చిన్నారులు. అహ్మదాబాద్‌ లోనూ చిన్నారికే వైరస్ సోకింది. 3 నెలల చిన్నారి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయింది. మరో చిన్నారి చికిత్స పొందుతోంది.

Tags:    

Similar News