ఊరికో సైబర్ నేరగాడు..దాదాపు 2 వేలకోట్లు..2024లో హైదరాబాద్ లో దోపిడీ
బర్ మోసాల్లో టాప్ 5 నగరాల్లో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, వరంగల్, సంగారెడ్డి ఉన్నాయి.
ఒకప్పుడు దొంగలంటే రాత్రివేళల్లో ఇళ్లలోకి చొరబడేవారు.. దారి కాచి దోపిడీ చేసేవారు.. కానీ, టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ దొంగల దారి మారింది. చేతిలో సెల్ ఫోన్ ఉన్నవారే వారికి టార్గెట్ అవుతున్నారు. రోజుకో మోసం.. కొత్త కొత్త వేషం.. వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు మహా నగరాలు ప్రధాన అడ్డాగా మారుతున్నాయి. ఏకంగా 2024లో ఒక్క హైదరాబాద్ లోనే రూ.1800 కోట్లు సైబర్ దోపిడీ జరిగిందంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
బరితెగింపు..
ఈ ఏడాది హైదరాబాద్ లో రూ.1,866 కోట్లను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఇందులో రికవరీ రూ.176 కోట్లు మాత్రమే. అంటే రికవరీ పది శాతం కూడా లేదు. అంతేకాదు.. 2024లో సైబర్ మోసాలు 18 శాతం పెరిగాయి.
షేర్ మార్కెట్ పేరిట..
ఈ ఏడాది జరిగిన సైబర్ మోసాల్లో అత్యధికం షేర్ మార్కెట్ పేరుతోనే. పార్ట్ టైం కొలువులు, డిజిటల్ అరెస్టులు, ఫేక్ కస్టమర్ కేర్, క్రెడిట్ కార్డు నేరాలు కూడా గణనీయంగా ఉన్నట్లు సైబర్ నేరాల వార్షిక నివేదిక వెల్లడించింది.
టాప్ 5 నగరాలు ఇవే..
సైబర్ మోసాల్లో టాప్ 5 నగరాల్లో సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, వరంగల్, సంగారెడ్డి ఉన్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1.14 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. సైబరాబాద్ (25,112), హైదరాబాద్ (20,299), రాచకొండ (14,815), వరంగల్ (3531), సంగారెడ్డి (3132)లలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
2023లో 16,339 ఎఫ్‌ఐఆర్ లు నమోదు కాగా, 2024లో ఆ సంఖ్య 24,643కి పెరిగిందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) డైరెక్టర్ శిఖా గోయెల్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపిన రాష్ట్ర పోలీసులు ఈ ఏడాది 14,984 సిమ్ కార్డులు, 9,811 ఐఎంఈఐ నంబర్లు, 1,825 వెబ్ సైట్ లను బ్లాక్ చేసినట్లు వెల్లడించారు.