గవర్నర్ ప్రసంగంలో 'పొరపాటు'.. చంద్రబాబు ఏమన్నారంటే!
'ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు' అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలను ఉద్దే శించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన చిన్న పొరపాటు కారణంగా.. విపక్షం నుంచి విమర్శలు, నెటిజన్ల నుంచి కూడా పెదవి విరుపులు కనిపించాయి. గవర్నర్ తన ప్రసంగంలో ముఖ్యమంత్రి 'నారా చంద్రబాబు నాయుడు' పేరును గవర్నర్ తప్పుగా చదివారు. 'ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు' అంటూ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు.
వాస్తవానికి ఇన్నాళ్ల పరిచయంలో గవర్నర్‌కు చంద్రబాబు కొత్తకాదు. ఆయన పేరు కూడా కొత్తకాదు. అయినప్పటికీ.. ఆయన స్క్రిప్టును చూసి చదవడంతోనే ఈ పొరపాటు దొర్లింది. పథకాల గురించి మాట్లాడుతూ.. విజనరీ లీడర్ అంటూ.. పలు సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు అన్నప్పటికీ.. మధ్యలోకి వచ్చేసరికి మాత్రం 'నరేంద్ర చంద్రబాబు నాయుడు' అని వ్యాఖ్యానించారు. ఈ విషయం వైరల్ కావడంతో సభా నాయకుడిగా చంద్రబాబు వరకు వెళ్లింది.
దీనిపై నవ్వుకున్న చంద్రబాబు.. స్క్రిప్టును పరిశీలించి.. దీనిని ఎవరు రూపొందించారో తెలుసుకుంటానని చెప్పారు. అంతేకాదు.. స్క్రిప్టులో పొరపాటు ఉంటే.. తప్పకుండా స్పీకర్ దృష్టికి తీసుకవెళ్లి.. చర్యలు తీసుకునేలా చూస్తామని చెప్పారు. ఇదిలావుంటే.. ఈ విషయంపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుండగా.. విపక్షం నేతలు.. చురకలు అంటిస్తున్నారు. గవర్నర్‌గారు.. సీఎంను మరిచిపోయారు! అని వైసీపీ సోషల్ మీడియా కామెంట్లు చేస్తోంది.