జర్మనీకి జగన్ కి లింకు పెట్టిన సేనాని : వైసీపీపై పవన్ ఫన్నీ కామెంట్స్

ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధినేత జగన్ తన పంతం నెరవేర్చుకోవాలంటే జర్మనీ వెళ్లడం ఒక్కటే మార్గమని సేనాని వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.

Update: 2025-02-24 09:45 GMT

సినిమాల్లో కామెడీ సీన్స్ పండించే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాలిటిక్స్ లో తొలిసారి ఫన్నీ కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ప్రవేశించిన నుంచి ఆవేశంగా మాట్లాడుతూ సమస్యలపై సీరియస్ గా రియాక్ట్ అయ్యే వారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన నోట మాటలు వచ్చాయంటే అవి ప్రత్యర్థులను చీల్చిచెండాడటమే.. కానీ, ఆయనలో తొలిసారి గోదావరి చమత్కారం కనిపించింది. ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ అధినేత జగన్ తన పంతం నెరవేర్చుకోవాలంటే జర్మనీ వెళ్లడం ఒక్కటే మార్గమని సేనాని వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి.

ప్రతిపక్ష హోదా ఇవ్వలేదంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై పంచులేశారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతం బీఏసీ సమావేశానికి హాజరైన పవన్ మధ్యలో మీడియాతో కాసేపు మాట్లాడారు. ప్రజలు 11 స్థానాలకే పరిమితం చేసినా వైసీపీ ప్రతిపక్ష హోదా కావాలంటూ మారం చేయడం సరికాదన్నారు. ఈ ఐదేళ్లు ప్రతిపక్ష హోదా కోసం ఎదురుచూడటం వేస్ట్ అంటూ తీసిపారేశారు. ఇదే క్రమంలో మీడియా ప్రతినిధులు మరోసారి రెట్టించి ప్రశ్నలు వేయడంతో పవన్ లో గోదావరి చమత్కారం బయటకు వచ్చింది.

‘‘మీరేమో సీట్లు లెక్కచెప్పి హోదా ఇవ్వలేమంటున్నారు. వారేమో ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నందున తామే ప్రతిపక్షం అంటున్నారు’’ అంటూ విలేకర్లు ప్రశ్నించడంతో పవన్ తనదైన స్టైల్ లో పంచులేశారు. ఓట్ల శాతం ఆధారంగా సీట్లు వచ్చే పద్ధతి మన దేశంలో లేదని.. అలా కావాలంటే జర్మనీ వెళ్లాల్సివుంటుందని చమత్కరించారు. జర్మనీలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ఓట్ల శాతం బట్టి సీట్లు కేటాయిస్తారని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. 5 శాతం కన్నా తక్కువ వచ్చిన వారి ఓట్లు ఎక్కువ ఓట్లు వచ్చిన పార్టీకి కలిపి సీట్లు కేటాయిస్తారని చెప్పారు. మన దేశంలో అలాంటి పద్ధతి లేనందున జగన్ జర్మనీ వెళ్లడం బెటర్ అంటూ సలహా ఇచ్చారు పవన్.

డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అందరినీ నవ్వు తెప్పించాయి. పవన్ ఈ కామెంట్లు చేస్తున్నప్పుడు ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేలు నవ్వడం కనిపించింది. మీడియా ప్రతినిదులు కూడా డిప్యూటీ సీఎం పవన్ చమత్కారానికి నవ్వు ఆపుకోలేకపోయారు. అందరూ నవ్వుతున్నా సేనాని మాత్రం తనదైన స్టైల్ లో సీరియస్ గానే మాట్లాడారు. దీంతో పవన్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్ జర్మనీ వెళ్లిపోవాల్సిందేనా? అంటూ ట్రోలర్లు రంగంలోకి దిగి దుమ్ముదులుపుతున్నారు. మరి ఈ ట్రోలింగును వైసీపీ సోషల్ మీడియా ఎలా తిప్పికొడుతుందో చూడాల్సివుంది.

Tags:    

Similar News