మరో 10 మంది ఎమ్మెల్యేలు రావడం పక్కా.. దానం కీలక వ్యాఖ్యలు
దీంతో వారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపు దారుల పై కేసు ఇంకా నడుస్తూనే ఉంది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటూ కాంగ్రెస్‌కు మద్దతుగా ఉంటున్నారు. దీంతో వారిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గతంలో అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కానీ.. స్పీకర్ నుంచి స్పందన లేకపోవడంతో వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరారు. దాంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు నిర్ణయాన్ని స్పీకర్‌కు వదిలిపెట్టింది. గడువులోపు స్పీకర్ చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని సూచించింది. దాంతో ఇప్పుడు ఆ అంశం స్పీకర్ చేతిలో ఉండిపోయింది.
అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు మొదలయ్యాయి. గత పదేళ్లలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగగా.. ఇప్పుడు అధికారం ‘చే’జిక్కడంతో అటు నుంచి ఇటు జంప్ అవుతున్నారు. ఈ క్రమంలో పది మంది ఎమ్మెల్యేల వరకు అఫీషియల్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వన్ బై వన్ భేటీ అయ్యారు. అయితే వారంతా కాంగ్రెస్ చేరినట్లేనని బీఆర్ఎస్ చెబుతున్నప్పటికీ చేరలేదని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అంటున్నారు. సరే.. టెక్నికల్‌గా ఏది ఏమైనప్పటికీ వారంతా మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్‌తోనే ఉండిపోయారనేది వాస్తవం.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని హైకోర్టు సీరియస్‌గా తీసుకుంది. వారి పట్ల చర్యల కోసం అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలిచ్చింది. దీంతో వారి విషయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఉంది. ఒకవేళ అనర్హత వేటు పడితే ఆ పది సీట్లలోనూ ఉప ఎన్నికలు తప్పవు. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా అదే చెబుతున్నారు. తప్పకుండా ఆయా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయని అంటున్నారు. ఈ వివాదంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరాలని గతంలో ఆసక్తి చూపిన వారంతా కాస్త వెనక్కి తగ్గారు. దాంతో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగిపోయాయి.
ఈ వలసలపై తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి దానం కూడా బీఆర్ఎస్ బీ ఫామ్ పైనే గెలిచి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయనపై కూడా ఫిరాయింపుల కేసు నడుస్తోంది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమపై హైకోర్టులో కేసు నడుస్తుండడంతో దానిని బూచీగా చూపి కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్న వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు వారిని రాకుండా అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాస్త ఆలస్యమైన వారి చేరిక పక్కా అని వ్యాఖ్యలు చేశారు.