దానం నాగేందర్ యూటర్న్.. తన ఇంట్లో కేసీఆర్ ఫొటో ఉంటే తప్పేంటని ప్రశ్న!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యూటర్న్ తీసుకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2025-02-04 11:20 GMT

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యూటర్న్ తీసుకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి జైకొట్టారు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే హైదరాబాద్ నగరంలో హైడ్రా పేరిట ఆక్రమణల తొలగింపును ఆయన వ్యతిరేకిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై విమర్శలు చేయడంతోపాటు హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ దుమారాన్ని లేపారు.

బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో పేదల ఇళ్లను కూల్చివేస్తానంటే సహించేది లేదని తెగేసి చెప్పారు. తనపై కేసులు పెట్టినా భయపడనని వ్యాఖ్యానించారు. తనపై ప్రస్తుతం 173 కేసులు ఉన్నాయని, అవసరమైతే పేదల కోసం జైలుకు వెళతానని వ్యాఖ్యానించారు. ఇది సమయంలో తన ఇంట్లో మాజీ ముఖ్యమంత్రులు వైఎస్, కేసీఆర్ ఫొటోలు ఉండటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభిమాన నాయకుల ఫొటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు.

మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నాగేందర్ వీరాభిమాని. 2004 ఎన్నికల సమయంలో నాగేందర్ కు టికెట్ రాలేదని కోపంతో టీడీపీలోకి వెళ్లగా, ఆ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి మళ్లీ నాగేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకున్నారు. ఆ తర్వాత మంత్రిని చేశారు. దీంతో రాజశేఖర్ రెడ్డిపై వీరాభిమానం పెంచుకున్నారు నాగేందర్. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన నాగేందర్ కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టారు. ఈ విధంగా ఆయనకూ నాగేందర్ అభిమాని అయ్యారు. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తున్న నాగేందర్.. హైడ్రా కూల్చివేతలపై రగిలిపోతున్నారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటానని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మళ్లీ ఆయన బీఆర్ఎస్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ తన అభిమాన నేత అంటూ చెప్పుకోవడం చూస్తే గులాబీ పార్టీకి మళ్లీ స్నేహ హస్తం చాస్తున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News