భారత్, పాక్ లకు డేంజర్ బెల్స్!
ఈ నేపథ్యంలో ప్రపంచ ఉష్ణోగ్రతలకు సంబంధించిన తాజా పరిశోధన పీర్–రివ్యూడ్ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురితమైంది.
ఇప్పుడు ప్రపంచ దేశాలను కల్లోలపరుస్తున్న అంశం.. గ్లోబల్ వార్మింగ్. భూతాపం లేక భూమి విపరీతంగా వేడెక్కడాన్నే గ్లోబల్ వార్మింగ్ అని నిపుణులు అంటున్నారు. దీనివల్ల అనేక దుష్పరిణామాలు ఉంటాయని చెబుతున్నారు. విపరీతమైన వేడితో ధ్రువ ప్రాంతాలు, మంచుతో కప్పబడి ఉన్న హిమాలయాల కరిగిపోతాయని.. ఫలితంగా ఆ నీరంతా సమీపంలోని సముద్రాల్లో చేరడంతో తీర ప్రాంతాలు మునిగిపోతాయని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రభావంతో కొన్ని కోట్ల మంది నిరాశ్రయులవుతారని అంటున్నారు.
మరోవైపు భూగోళం వేడెక్కడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని.. దీంతో ఏసీల వాడకం ఎక్కువ అవుతోందని.. ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్, ఇతర కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున గాలిలో కలుస్తాయని చెబుతున్నారు. అలాగే ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎక్కడకక్కడ అడవుల్లో కార్చిచ్చులు లేవడం, జంతుజాలం నశించడం, చిన్న నదులు, వాగులు, సరస్సులు, చెరువులు ఎండకు అడుగంటడం జరుగుతాయని పేర్కొంటున్నారు.
ఆందోళనకరమైన విషయం ఏమిటంటే భూ ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత ఇప్పటికే దాదాపు 1.15 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. బ్రిటన్ లో వచ్చిన పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుండి ఈ పెరుగుదల ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు పరిశ్రమల ద్వారా వాతావరణంలోకి పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తున్నాయని అంటన్నారు.
ఈ నేపథ్యంలో ప్రపంచ ఉష్ణోగ్రతలకు సంబంధించిన తాజా పరిశోధన పీర్–రివ్యూడ్ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురితమైంది. ఇప్పుడు ఇది అందరిలో ఆందోళన నింపుతోంది. రానున్న ఏళ్లలో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు పెరుగుతుందని.. దీని ప్రభావం భారత్, పాకిస్థాన్, తదితర దేశాలపై ఉంటుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో 220 కోట్ల మంది ప్రజలు తీవ్ర వేడిని ఎదుర్కోవాల్సి వస్తుందని పీర్–రివ్యూడ్ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది.
ఈ పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజల్లో హీట్ స్ట్రోక్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. ముఖ్యంగా మన దేశంలో ఉత్తర భారతదేశం, పాకిస్థాన్ లో తూర్పు పాకిస్తాన్, తూర్పు చైనా, సబ్–సహారా ఆఫ్రికాలో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని అంటున్నారు.
పీర్–రివ్యూడ్ జర్నల్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ప్రచురించిన పరిశోధన ప్రకారం.. ఉష్ణోగ్రత పెరిగితే ఉత్తర భారతదేశం, తూర్పు పాకిస్తాన్, తూర్పు చైనా, సబ్–సహారా ఆఫ్రికా దేశాల ప్రజలను అధిక తేమతో కూడిన వేడి గాలులు చుట్టుముడతాయి. ఇది చాలా ప్రమాదకరం.
వాతావరణ మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రత పెరుగుతోందని పరిశోధనల్లో వెల్లడైంది. 2015లో 196 దేశాలు ఉష్ణోగ్రతలను నివారించడానికి చర్యలు తీసుకుంటామని, కర్బన ఉద్గారాల వాడకాన్ని తగ్గిస్తామని పారిస్ ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం.. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక విప్లవం పూర్వ స్థాయి కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ తగ్గించడం. అయితే ఉష్ణోగ్రత పెరుగుదల అదుపులో లేదని ప్రపంచంలోని ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) బాంబు పేల్చింది. ఈ శతాబ్ది చివరి నాటికి ప్రపంచంలో దాదాపు 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఈ సంస్థ షాకింగ్ విషయం వెల్లడించింది.
ఈ నేపథ్యంలో భూతాపాన్ని అరికట్టడానికి ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడం, ఇంధన శిలాజాలకు బదులుగా సౌర విద్యుత్, పవన్ విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ వనరుల వైపు దృష్టి సారించాలని చెబుతున్నారు.