ఏపీ ఎన్నికలను తలపిస్తున్న ఢిల్లీ ప్రచారం!
మరో వారం రోజుల్లో దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నేటి నుంచి 5 రోజుల్లో ప్రచార పర్వం కూడా ముగియనుంది.
మరో వారం రోజుల్లో దేశ రాజధాని రాష్ట్రం ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నేటి నుంచి 5 రోజుల్లో ప్రచార పర్వం కూడా ముగియనుంది. ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కీలక పార్టీలైన.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య ముక్కోణపు పోరు తారస్థాయికి చేరింది. పథకాల నుంచి విమర్శల వరకు.. నాయకులు ఎక్కడా తల ఒగ్గడం లేదు. ఎవరికివారు.. దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. యమునా నదిలో విషం కలుపుతున్నారంటూ.. ఢిల్లీ మాజీసీఎం కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఇక, ఇదే యమునను అడ్డు పెట్టుకుని ప్రధాని మోడీ ఎదురుదాడి చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ ఏకంగా కేజ్రీ వాల్ ఆస్తుల పైనే విమర్శల ఎక్కు పెట్టింది. వెరసి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ అధికారం చేజార్చుకోరాదని ఆప్ ప్రయత్నిస్తోంది. కానీ, గత అస్థిత్వాన్ని తిరిగి నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక, మూడు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత.. జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో మోడీ కూడా అంతే సీరియస్‌గా తీసుకున్నారు.
దీంతో ఢిల్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎవరిదనే అంచనాలు.. లెక్కలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. ప్రస్తుతం అధికంగా ఓటు బ్యాంకు ఉన్న అగ్రవర్ణాలపై అధికార పార్టీ.. ఆప్, కాంగ్రెస్‌లు ఆధారపడ్డాయి. ఉత్తరాది బ్రాహ్మణులను టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు. ఇక, పటేళ్లు, గుజ్జర్లు వంటి బీసీ సామాజిక వర్గాలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఈ మూడు పార్టీలు కూడా.. ఉచిత పథకాల ప్రకటనల్లో ఎవరికివారు మించి పోయారు.
వెరసి.. మరో నాలుగు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరుగుతున్నా.. ఎవరు గెలుపు గుర్రం ఎక్కుతారనే విషయంపై తల పండిన మేధావులు కూడా పక్కా అంచనాకు రాలేక పోతున్నారు. తనపై కేసులు పెట్టి వేధించారంటూ.. సింపతీని రంగరిస్తున్న కేజ్రీవాల్, తమ పాలనను చూడలేదా.. ఎన్నో చేశామంటూ.. కాంగ్రెస్ తెరుస్తున్న గత చరిత్ర పుస్తకాలు.. ఈ రెండు పార్టీలూ ఒక్కటే.. మేమే అసలైన అభివృద్ధి చోదకులం అంటూ.. కమల నాథులు చేస్తున్న ప్రచారం వంటివి ఢిల్లీ వాసులకు ఎవరిని ఎంపిక చేసుకోవాలనేది బిగ్ టెస్ట్‌గా మారిపోయింది.