ఉత్తరాంధ్ర కు రాజ్యసభ సీటు కోసం డిమాండ్
దాంతో ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేవారు అని భావించేవారు.
ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించేవారు ప్రస్తుతం లేరు. ఆ మాటకు వస్తే చాలా ఏళ్ళుగా ఉత్తరాంధ్ర నుంచి ఎవరినీ పార్టీలు ఎంపిక చేయడం లేదు. విజయసాయిరెడ్డి నెల్లూరు వాసి అయినా ఆయన వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా వ్యవహరించేవారు. దాంతో ఆయన ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రాతినిధ్యం వహించేవారు అని భావించేవారు.
ఆయన తన పదవిని వదులుకున్న తరువాత ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కూటమి పెద్దలు కొత్త వారిని ఎంపిక చేయాలన్న డిమాండ్ అంతకంతకు పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాలు అయిన విశాఖ శ్రీకాకుళం, విజయనగరంల నుంచి తెలుగుదేశం పార్టీ దశాబ్దాలుగా ఎంపిక చేయలేదని అంటున్నారు.
సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు 1998లో రాజ్యసభకు సభ్యుడు అయ్యారు. ఆ తరువాత మళ్ళీ టీడీపీ ఎవరికీ ఈ సీటు ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన దివంగత నేత మాజీ లోక్ సభ సభ్యుడు అయిన ఎంవీవీఎస్ మూర్తి రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేసినా నెరవేరలేదు. అలాగే అనేక మంది సీనియర్లు ఈ పదవి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ చాన్స్ వారికి రాలేదు
ఇపుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన సీటుని ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి సీనియర్ ఎవరికైనా ఇచ్చి భర్తీ చేయాలని డిమాండ్ వస్తోంది. విజయనగరం జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుకు రాజ్యసభ సీటు ఇస్తారని ఎన్నికల ముందు ప్రచారం సాగింది. కూటమి అధికారంలోకి వచ్చాక మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అయితే ఇందులో రెండు టీడీపీ ఒకటి బీజేపీ తీసుకున్నాయి.
ఉత్తరాంధ్రాకు మాత్రం ఈ రెండింటిలో ఒక్క సీటూ ఇవ్వలేదని అంటున్నారు. ఇపుడు విజయసాయిరెడ్డి సీటు అయినా ఇస్తే ఉత్తరాంధ్రకు న్యాయం చేసినట్లుగా ఉంటుందని అంటున్నారు. మరో వైపు చూస్తే రాజ్యసభ కోసం చాలా మంది ఆశావహులు ముందుకు వస్తున్నారు. మాజీ మంత్రులు సీనియర్ నేతలు కూడా తమకు పెద్దల సభలో ఒక్కసారి అడుగుపెడితే చాలు అని భావిస్తున్నారు.
అయితే కూటమి పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియదు. అసలు ఈ సీటుని టీడీపీకి కేటాయిస్తారా లేక బీజేపీ తీసుకుంటుందా లేక జనసేనకు ఇస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. అయితే ఉత్తరాంధ్ర నుంచి డిమాండ్ వస్తోంది కాబట్టి వచ్చే ఏడాది ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ సీట్లలో ఒకటి అయినా ఈ ప్రాంతం వారికి ఇచ్చి పెద్దల సభకు పంపించాలని కోరుతున్నారు.
కాంగ్రెస్ హయాంలో సీనియర్ నేత ద్రోణం రాజు సత్యనారాయణ రెండు సార్లు వరసగా విశాఖ జిల్లా నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన తరువాత అదే విశాఖ నుంచి సీనియర్ నేత టి. సుబ్బరామిరెడ్డి మూడు సార్లు రాజ్యసభకు నెగ్గారు. ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్ ని రాజ్యసభకు కాంగ్రెస్ గతంలో పంపించింది. అదే కాంగ్రెస్ నుంచి డెబ్బై దశకంలోనే ఇటీవల దివంగతులైన శ్రీకాకుళం జిల్లా వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం రాజ్యసభలో అడుగుపెట్టారు.
ఈ విధంగా కాంగ్రెస్ రాజ్యసభ సీట్లలో ఉత్తరాంధ్రాకు న్యాయం చేసిందని ప్రజా సంఘాల నేతలు మేధావులు గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగినా అది ఆచరణలో అమలు కాలేదు ఇపుడు అశోక్ గజపతిరాజుకు రాజ్యసభ సీటుని టీడీపీ ఇస్తే కనుక ఉత్తరాంధ్రాకు తగిన న్యాయం దక్కుతుందని అంటున్నారు.