స్టాలిన్ కొడుకు ఉప ముఖ్యమంత్రిగా... మరి లోకేష్ ఎపుడు ?
తమిళనాడు అంటేనే వారసత్వ రాజకీయం. కరుణానిధి ఆయన తరువాత కుమారుడు స్టాలిన్
తమిళనాడు అంటేనే వారసత్వ రాజకీయం. కరుణానిధి ఆయన తరువాత కుమారుడు స్టాలిన్. ఇపుడు ఆయన కుమారుడు ఉదయ నిధి స్టాలిన్. డీఎంకే పార్టీలో వారసత్వం మూడు తరాలుగా సాగుతోంది. 2021లో స్టాలిన్ దాదాపుగా ఏడు పదుల వయసులో సీఎం అయ్యారు. ఆయన అప్పటికి పదిహేనేళ్ల క్రితం కరుణా నిధి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేశారు.
స్టాలిన్ కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కేసరికి వయసు 55 ఏళ్ళు దాటింది. సీఎం పదవి 70 ఏళ్లకు వచ్చింది. కానీ అదే పదవిని ఉదయనిధి స్టాలిన్ కి అయిదు పదులు నిండకుండానే అప్పగించాలని స్టాలిన్ చూస్తున్నారు అని అంటున్నారు. దానికి తగిన ప్రాతిపదికను ఇప్పుడే తయారు చేసి సిద్ధంగా ఉంటున్నారని అంటున్నారు.
తొందరలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిని చేస్తారు అని తమిళనాడులో ప్రచారం ఒక్క లెక్కన సాగుతోంది. ప్రస్తుతానికి ఉదయనిధి స్టాలిన్ మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన హోదాను మరింతగా పెంచడం ద్వారా 2026 నాటికి ఆయనే సీఎం అభ్యర్ధి అని చాటి చెప్పడమే స్టాలిన్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు.
ఈ విధంగా చేయడం ద్వారా తాను రాజకీయాల నుంచి తప్పుకుని కుమారుడికి మంచి భవిష్యత్తు ఇవ్వాలన్నదే స్టాలిన్ ఉద్దేశ్యం అని అంటున్నారు. దీని మీద పార్టీలఒ ఏ రకమైన అసంతృప్తి రాకుండా ఆయన జాగ్రత్త పడుతున్నారు. ఒక్కో మెట్టూ కుమారుడిని ఎక్కిస్తూ ఇపుడు తన పక్క సీటు ఇచ్చేయబోతున్నారు.
అయితే దీని మీద ఉదయనిధి మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో మంత్రులు అంతా ఉప ముఖ్యమంత్రులే అని కామెంట్స్ చేశారు. అందరూ తన తండ్రి తరువాత అంతటి వారే అని చెప్పారన్న మాట. అయితే ఉదయనిధి ఎలా చెప్పినా ఆయనకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పెరుగుతున్న గౌరవం దక్కుతున్న మర్యాద బిగుస్తున్న పట్టు అందరికీ తెలుసు అని అంటున్నారు.
వచ్చే ఎన్నికలను దాదాపుగా ఉదయనిధి స్టాలిన్ నడిపిస్తారు అని అంటున్నారు. తమిళనాడులో అన్నా డీఎంకే చతికిలపడడం తో సరైన ప్రత్యర్ధి లేకపోవడంతో 2026లోనూ డీఎంకే విజయం ఖాయమని అంటున్నారు అందుకే సరిగ్గా ఇదే అదనుగా చేసుకుని కుమారుడిని భావి సీఎం గా అటు జనంలోనూ పార్టీ జనంలోనూ ప్రమోట్ చేస్తున్నారు అని అంటున్నారు.
మరి ఏపీలో లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిని చంద్రబాబు చేయగలుగుతారా అన్న చర్చ ఇదే సమయంలో సాగుతోంది. లోకేష్ కూడా ఇది రెండోసారి మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం. పైగా తండ్రికి తోడు నీడగా ఉంటున్నారు 2029 ఎన్నికల్లో పార్టీని నడిపించాల్సిన వారుగా ఉన్నారు. టీడీపీలో అయితే ఆయనకు ఏ పోరూ పోటీ అసలు లేదు. ఉదయనిధి కనుక ఉప ముఖ్యమంత్రి అయితే ఆ ప్రభావం ఏపీ మీద పడుతోందని లోకేష్ ని చేయాలని డిమాండ్ వచ్చినా రావచ్చు అంటున్నారు. ఇప్పటికే కూటమిలో పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి లోకేష్ కి ఆ చాన్స్ ఎపుడు వస్తుంది అన్నదే చర్చగా ఉంటుంది.