తెలుగు రాష్ట్రాల్లో లేని అడ్జెస్ట్ మెంట్ మహారాష్ట్రలో కనిపిస్తోంది!

అనుకున్నదే నిజమైంది. అంచనాలకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Update: 2024-12-06 06:30 GMT

అనుకున్నదే నిజమైంది. అంచనాలకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకున్నాయి. అధికారం చేతికి వచ్చే అవకాశం కించిత్ ఉన్నా.. అధికారాన్ని తమ చేతిలోకి తీసుకోవటానికి ఏమైనా చేసే అలవాటున్న మోడీషాలు.. అనుకున్నట్లే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ను సీఎం చేయటం తెలిసిందే. మహారాష్ట్రకు ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయటంతో పది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు తెర పడినట్లైంది.

గతంలో రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన దేవేంద్ర తొలిసారి ఐదేళ్లు.. రెండోసారి ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. మూడోసారి సీఎం అయిన ఆయన.. ఈసారి ఎంత కాలం ముఖ్యమంత్రిగా ఉంటారో చూడాలి. ఇక.. సీఎంగా దేవేంద్ర.. డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే.. అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు.

మహారాష్ట్ర రాజకీయాల్నిచూస్తే మాత్రం అడ్జెస్టు మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా అక్కడి నేతలు నిలుస్తారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దేవేంద్ర ఫడ్నవీస్.. కాలం కలిసి రాని కాలంలో డిప్యూటీ సీఎంగా వ్యవహరించటం.. ఏక్ నాథ షిండే సీఎంగా ఉన్నప్పుడు సర్దుకుపోవటం కనిపిస్తుంది. అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకోవటంతో పాటు.. తన పాలనపై ప్రజలను తీర్పు కోరుతూ ఎన్నికల బరిలోకి దిగి.. విజయం సాధించటం ద్వారా ఏక్ నాథ్ షిండే సంచలనాన్ని క్రియేట్ చేశారని చెప్పాలి.

అయినప్పటికి బీజేపీ బలాన్ని గుర్తించటం.. అందుకు అనుగుణంగా జరిగే అధికార బదిలీ వేళలో మనసుకు నచ్చని పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికి సర్దుకొని.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టటం చూస్తే.. మహారాష్ట్ర రాజకీయ నేతల్లో ఉన్న సర్దుబాటుగుణం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించదు. ఒకసారి ముఖ్యమంత్రి అయితే.. అంతకు తక్కువ పదవులకు ససేమిరా అనటం కనిపిస్తుంది. పరిస్థితులకు తలొగ్గేందుకు తగ్గేదేలే అన్నట్లు ఉంటారే తప్పించి.. కాలానికి అనుగుణంగా అన్న మాటే వినిపించదు. అది సీఎం పదవి అయినా.. చిన్న పదవి అయినా.

కానీ.. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్.. తాజాగా ఏక్ నాథ్ షిండేలను చూస్తే.. సమకాలీన రాజకీయాలకు తగ్గట్లు నేతలు ఎలా ఉండాలో తమ తీరుతో వారిద్దరు చెప్పేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పాటును చూసిన తర్వాత అర్థమయ్యేది ఒక్కటే.. అధికారాన్ని అందుకునే ఏ అవకాశాన్ని బీజేపీ వదులుకోదని. ఈ సందర్భంగా ఆటలో ఎంతటి శక్తివంతమైన ఆటగాడు ఉన్నా.. తాము చెప్పింది మాత్రమే చేసేలా సదరు ఆటగాడిని సెట్ చేసే విషయంలో మోడీషాలకు తిరుగు ఉండదని.

Tags:    

Similar News