ఫోన్ కాల్స్ రికార్డు చేస్తారని తెలీదా ఉదయభాను?

తాజాగా పార్టీకి చెందిన ఒక ఎస్టీ నాయకుడిపై ఆయన నోరు పారేసుకున్న ఆడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది.

Update: 2024-01-08 04:56 GMT

మనోళ్లు ఎవరో.. పరాయివాళ్లు ఎవరో చూసుకొని మాట్లాడాల్సిన బాధ్యత నేతల మీదే ఉంటుంది. ఎన్నికలు దగ్గరకు వచ్చేసిన వేళ.. సమయానికి అనుగుణంగా కొందరు ప్లేట్లు మార్చేయటం మామూలే. ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నాయకుడైతే మాత్రం? అంటూ నిలదీసే ధోరణిలో మాట్లాడటం ఈ మధ్యన కొందరికి అలవాటైంది. ప్లాన్ గా ఫోన్ కాల్స్ ను రికార్డు చేసి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ చేసే తెలివి ఎంతన్న విషయాన్ని గుర్తించకుండా.. తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఏపీ విప్ కమ్ జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాదిరి అడ్డంగా బుక్ కావటం ఖాయం.

తాజాగా పార్టీకి చెందిన ఒక ఎస్టీ నాయకుడిపై ఆయన నోరు పారేసుకున్న ఆడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది. ఈ వైరల్ క్లిప్ లోని అంశాలతో పాటు.. అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే.. తన నియోజకవర్గం పరిధిలోని ఎస్టీ నాయకుడు బుజ్జిబాబు. ఆయనకు ఈ మధ్యన ఫోన్ చేసిన విప్ ఉదయభాను.. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత.. జగ్గయ్యపేటలోని ఇంటికి ఒకసారి వచ్చి కలవాల్సిందిగా కోరారు. అందుకు బుజ్జిబాబు స్పందిస్తూ.. కలవటానికి కుదరదు సార్ అని రిప్లై ఇచ్చారు.

తాను పిలిచినంతనే వస్తాను సార్ అన్న మాటే తప్పించి.. కుదరదన్న మాట రావట తెలీని ఉదయభాను ఈగోకు పోయారు. అంతే తప్పించి.. తాను టెంప్టు కాకూడదన్న విచక్షణను మరిచారు. ఇంటికి రమ్మంటే రావటానికి కుదరదేంటి? అన్న ఉదయభాను ప్రశ్నకు.. సర్పంచ్ కోసం అడగటానికి వస్తే.. తప్పు చేసినట్లుగా అన్న విషయాన్ని గుర్తు చేసిన బుజ్జిబాబుతో.. అప్పుడు జరిగిపోయింది.. సర్పంచి ఎలక్షన్ అయిపోయింది.. నువ్వు రా ఒకసారి మాట్లాడుకుందామన్న మాటను ఉదయభాను చెప్పారు.

తాను సర్పంచిగా పోటీ చేసేందుకు తండా నుంచి ఊళ్లో నుంచి యాభై మంది వరకు ఇంటికి వస్తే.. నీ చేష్టలన్నీ నా ఫోన్ లో ఉన్నాయని అన్నారుగా? అంటూ బుజ్జిబాబు మాటలతో అయినా తెలివి తెచ్చుకోవాల్సిన ఉదయభాను ఆ విషయాన్ని వదిలేసి.. ‘ఇప్పుడేం చేయమంటావు దానికి? నేను రమ్మంటున్నా.. నువ్వు వస్తానంటావా? రానంటావా?’ అని ప్రశ్నించారు. దీనికి బుజ్జిబాబు.. నేను రాను సార్..మీకుఅవసరం ఉంటే.. మీరు బూదవాడకు వచ్చి కలవటమే తప్పించి నేను మీ కాడికి రాలేనని తేల్చేశారు.

దీంతో.. కోపం తెచ్చుకున్న ఉదయభాను.. ‘అంటే నేను వచ్చి నిన్నుకలవాలా?’ అని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహానికి గురైన ఉదయభాను.. నేను నీ దగ్గరకు రావాలా? అంటూ నోటికి వచ్చినట్లుగా తిట్ల దండకాన్ని అందుకున్నారు ఉదయభాను. ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఫోన్ చేశారన్న బుజ్జిబాబు.. ‘నేను తప్పు చేశానని ఆ రోజు మీరు చెప్పారు. ఆ తప్పేంటో బూదవాడలో మన పార్టీలో మనమే కూర్చొని మాట్లాడుకుందాం’ అంటే.. దానికి ప్రతిగా ఉదయభాను స్పందిస్తూ.. ఊళ్లో అక్కర్లేదని.. నువ్వు రా.. మాట్లాడాలని చెప్పగా..కుదరదని చెప్పిన వైనం వైరల్ గా మారింది. తాను బ్యాలెన్సు మిస్ అయ్యేలా మాట్లాడుతున్న తీరును గుర్తించకుండా.. ఫోన్ లో తెగ మాట్లాడిన ఉదయభాను ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందుకే అంటారు.. ప్రత్యర్థి పార్టీ సంగతి తర్వాత.. సొంత పార్టీకి చెందిన వారితోనూ డీల్ చేసేటప్పుడు కాస్తంత ఆచితూచి అన్నట్లు మాట్లాడకుంటే ఇబ్బందే అని. ఈ విషయం తాజా ఎపిసోడ్ లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు.

Tags:    

Similar News