బిహార్ ఫెయిల్యూర్ స్టేట్.. పీకే సంచలన వ్యాఖ్యలు
దేశంలో ఎన్నో పార్టీలు రాజకీయంగా అధికారంలోకి వచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ఆయా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు.
దేశంలో ఎన్నో పార్టీలు రాజకీయంగా అధికారంలోకి వచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ ఆయా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఒకప్పుడు కేంద్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ కూడా ఆయన వ్యూహకర్తగా పనిచేశారు. ఇటీవల ఆయన ఎన్నికల వ్యూహకర్త నుంచి తప్పుకున్నారు. సొంతంగా ఇటీవల బిహార్‌లో పార్టీని స్థాపించారు. జన్ సురాజ్ పేరిట కొత్తగా పార్టీని పెట్టారు. బిహార్‌లో అధికారమే లక్ష్యంగా ఆయన పార్టీని తీసుకొచ్చారు. అయితే.. ఇటీవల జరిగిన బైపోల్ ఎలక్షన్లలో ఆయన పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
బిహార్ స్టేట్‌లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గాల్లో జన్ సురాజ్ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో నిలిపారు. కానీ.. ఒక్క స్థానంలో కూడా సత్తాచాటలేకపోయారు. రామ్‌గఢ్, తరారీ నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందగా.. బెలగంజ్, ఇమామ్‌గంజ్ నియోజకవర్గాలను వరుసగా జేడీయూ హిందుస్థానీ అవామ్ మోర్చా గెలుచుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ పార్టీ తొలి ప్రయత్నంలోనే బొక్కా బోర్లా పడిపోయింది. పలు పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చానని చెబుతున్న పీకే.. కనీసం తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. దీంతో బిహార్ రాష్ట్రంలో ఆ పార్టీ మనుగడ సాధిస్తుందా అన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి.
ఈ క్రమంలో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బిహార్ రాష్ట్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ను ఫెయిల్యూర్ స్టేట్‌గా పోల్చారు. రాష్ట్రం అభివృద్ధి వైపు నడవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికాలోని బిహారీ ప్రవాసులతో వర్చువల్‌గా మాట్లాడారు. బిహార్ రాష్ట్రం తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, బిహార్ ఒక దేశమైతే.. జనాభా పరంగానే ప్రపంచంలోనే 11వ అతిపెద్ద దేశం అవుతుందని తెలిపారు. జనాభాపరంగా జపాన్ దేశాన్ని దాటేసిందని, ప్రత్యక్ష పాలనా ఫలితాలను సాధించడానికి నిరంతరం కృషి అవసరమని చెప్పుకొచ్చారు.
వచ్చే 2025లో బిహార్‌లో జన్ సురాజ్ ప్రభుత్వం ఏర్పడితే.. తమ తొలి ప్రాధాన్యత పాఠశాల విద్యను అభివృద్ధి చేయడమేనని పీకే చెప్పారు. మద్యపాన నిషేధం వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. బిహారీ ప్రవాసులు కేవలం చర్చలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ సత్తా చాటకపోయినప్పటికీ.. పార్టీ భవిష్యత్తుపై ఆశాజనకంగానే ఉన్నామని వెల్లడించారు. 2025లో ఖచ్చితంగా జన్ సురాజ్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.