వైసీపీ మళ్లీ గెలిచి ఉంటే.. గం*జాయిని అంతరపంటగా వేసేవారేమో: చంద్రబాబు
తాజాగా ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మత్తు పదార్థాల వినియోగం, కట్టడి , రాజకీయ పరమైన అంశాలపై స్పందించారు.;
తమ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడడం లేదని సీఎం చంద్రబాబు చెప్పారు. కక్ష సాధింపులకు పాల్పడితే వైసీపీ ఉంటుందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం మాదిరిగా వివేచన, విచక్షణ లేకుండా ప్రవర్తించబోమని చెప్పారు. తమ ప్రభుత్వం ఎవరిపై నా కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించబోదన్నారు. అయితే.. సమాజాన్ని ఇబ్బంది పెట్టడం, రౌడీయిజం చేయడం, మహిళలను వేధించడం, దుర్భాషలాడడం వంటివి చేసేవారిని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించేది లేదని తెగేసి చెప్పారు. ఈ వ్యవహారం లో ఎంతటి వారున్నా.. జైలుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు.
తాజాగా ఏపీ అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మత్తు పదార్థాల వినియోగం, కట్టడి , రాజకీయ పరమైన అంశాలపై స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి, మత్తు పదార్ధాలు లభించాయని ఆరోపించారు. దీంతో విద్యార్థులు, కళాశాలలు కూడా మత్తుకు కేంద్రంగా మారాయని దుయ్యబట్టారు. ``అధ్యక్షా.. ఏమాత్రం ఇప్పుడు వారు గెలిచి ఉన్నా.. గం*జాయిని అంతరపంటగా ప్రోత్సహించి.. రాయితీలు కూడా ఇచ్చేవారేమోనని అనుమానం వేస్తోంది`` అని అని చంద్రబాబు చమత్కరించారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి.
రాష్ట్రంలో పెచ్చరిల్లుతున్న గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు ఈ నేపథ్యంలోనే ఈగిల్ అనే సరికొత్త వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ఈ వ్యవస్థ ద్వారా గం*జాయిని ఒక్క ఎకరం కాదుకదా.. ఒక్క మొక్క కూడా పెంచకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఈ విషయంలో పూర్తి అధికారాలు.. ఈగిల్‌కు కల్పించినట్టు తెలిపారు. రాష్ట్రంలో రౌడీయిజం చేసేవారిని కఠినంగా శిక్షించకపోతే.. దేశంలో ఏపీ పరిస్థితిమరింత దిగజారుతుందన్నారు. అందుకే.. ఎవరు రౌడీయిజం చేసినా..పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా శిక్షించమని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
దోపిడీలు, దొంగతనాలు వైసీపీ హయాంలో అధికారంలో ఉన్నవారే చేశారని తమ అధికారులు చెప్పినట్టు చంద్రబాబు తెలిపారు. భూముల నుంచి ఆస్తుల వరకు వారు అన్నీ దోచుకున్నారని తెలిపారు. అయితే.. ఇప్పుడు అలాంటివి ఏమీ జరగకుండా.. కూటమి ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టిందన్నారు. భూముల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలిపారు. ఎక్కడా ఎవరూ.. నష్టపోకుండా.. కొత్త భూచట్టాన్ని తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు కూటమి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం ఉందంటే.. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టేనని ప్రజలు భావిస్తున్నారని చంద్రబాబు తెలిపారు.