పిక్ ఆఫ్ ది డే : కుర్చీని ఎత్తుకొని వెళ్లిన కెనడా ప్రధాని

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-03-12 09:15 GMT

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. లిబరల్ పార్టీ ఇప్పటికే మార్క్ కార్నీని తన కొత్త నేతగా ఎన్నుకోగా, త్వరలోనే ఆయన కెనడా తదుపరి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ట్రూడోకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. పార్లమెంటు భవనం నుంచి బయటకు వస్తున్న సమయంలో ట్రూడో తన కుర్చీని చేతపట్టుకుని, నాలుక బయట పెట్టి సరదాగా పోజిచ్చారు. ఈ దృశ్యాన్ని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ చిత్రీకరించగా, అది క్షణాల్లోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ ఫోటోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ట్రూడో సాధారణ జీవితాన్ని ఆచరించేందుకు సిద్ధమవుతున్నారని అభిప్రాయపడగా, మరికొందరు అతని ప్రవర్తనను సరదాగా, మరికొందరు విమర్శనీయంగా చూస్తున్నారు.

ఇదిలా ఉండగా కెనడాలో పార్లమెంటు సభ్యులు పదవీ విరమణ సమయంలో తమ కుర్చీలను వెంట తీసుకెళ్లే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ట్రూడో చేసిన ఈ పని కొంతమందికి ఆశ్చర్యంగా, మరికొందరికి హాస్యాస్పదంగా అనిపించింది.

కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో పార్లమెంట్‌ను వీడే ముందు భావోద్వేగ ప్రసంగం చేశారు. గత పదేళ్లుగా తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సాధించిన విజయాలను గర్వంగా గుర్తు చేసుకున్నారు. ‘‘గత దశాబ్దంలో కెనడా భవిష్యత్‌ను మెరుగుపరిచేందుకు తీసుకున్న ప్రతి నిర్ణయం న్యాయమైనదే. మనం సాధించిన ప్రగతిపై గర్వపడాలి’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.కెనడా కొత్త యుగంలోకి అడుగు పెట్టుతున్న ఈ సమయంలో, దేశాన్ని మరింత అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ట్రూడో పిలుపునిచ్చారు. కెనడాను ప్రపంచంలోనే అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా కలిసి పని చేయాలని తన మద్దతుదారులకు సందేశం పంపారు.

ఇటీవల ట్రూడో ప్రధానమంత్రి పదవికి అలాగే లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి కూడా జనవరి 6న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మార్క్ కార్నీ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం (కెనడా కాలమానం ప్రకారం) ట్రూడో అధికారికంగా కార్నీకి బాధ్యతలు అప్పగించారు.

Full View
Tags:    

Similar News