భర్త ఉద్యోగం కోసం ప్లాన్ చేసి మరీ చంపేసిన భార్య
కారణం ఏమైనా కానీ ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులు పథకం ప్రకారం చంపేస్తున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.;
కారణం ఏమైనా కానీ ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులు పథకం ప్రకారం చంపేస్తున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. బంధాల మీద కొత్త సందేహాలకు తావిచ్చేలా పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ఉదంతాల్లో భర్త పెట్టే టార్చర్ భరించలేని భార్యలు హత్య చేస ప్లాన్లు వేస్తుంటే.. మరికొన్ని ఉదంతాలు వివాహేతర సంబంధాలను కొనసాగించేందుకు వీలుగా భర్తల్ని చంపేస్తున్నారు.
తాజాగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఈ తరహా ఉదంతం చోటు చేసుకుంది. నల్గొండ పాతబస్తీకి చెందిన 44 ఏళ్ల మహ్మద్ ఖలీల్ ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ గా పని చేస్తుంటాడు. ఇటీవల అతడు మూర్ఛ వచ్చి కింద పడటంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స చేస్తుండగా చనిపోయాడు. దీంతో.. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మరణంగా పేర్కొంటూ విచారణ చేపట్టారు.
అయితే.. తన కొడుకు మరణం మీద సందేహాలు ఉన్నాయంటూ ఖలీల్ తల్లి పోలీసులకు చెప్పటంతో పోస్టుమార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన నివేదిక ఇటీవల వచ్చింది. తలకు బలమైన గాయం అయినట్లుగా పేర్కొంటూ శవపరీక్ష నివేదికలో పేర్కొన్నారు. దీంతో సందేహానికి గురైన పోలీసులు ఖలీల్ భార్య అస్సర్ జహను అదుపులోకి తీసుకొని విచారించారు.
తమకు 2007లో పెళ్లైందని.. ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత భర్త మద్యానికి బానిసైనట్లుగాతెలిపింది. దీంతో.. తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడని.. అతడ్ని అడ్డు తొలగించుకుంటే తనకు కానీ తన పిల్లలకు కానీ ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని భావించి అతడి తలపై బలమైన వస్తువుతో కొట్టిన విషయాన్ని ఒప్పుకుంది. దీంతో మూర్ఛ వచ్చిందని అబద్ధం చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా పేర్కొంది. దీంతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. మద్యం తాగి వేధింపులకు దిగితే.. చంపేయటమా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.