మా మందు మీద భారత్ పన్ను బాదుడు.. అమెరికా కడుపు మంట

తమ నుంచి టారిఫ్ లు వసూలు చేస్తున్న దేశాలపై తామూ ప్రతీకార టారిఫ్ లు వేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-03-12 08:46 GMT

అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి టారిఫ్ ల కొరడా పట్టుకుని తిరుగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా పొరుగునున్న కెనడా ఉక్కు, అల్యూమినియంపై 50 శాతం సుంకాలు వేశారు. మరో పొరుగు దేశం మెక్సికోతో పాటు ఎక్కడో ఉన్న చైనానూ వదల్లేదు.. ఇక భారత్ తోనే ఆయన కాస్త ఆచితూచి వ్యవహరించారని చెప్పొచ్చు. అప్పటికీ భారత్ తమ ఉత్పత్తులపై భారీగా పన్నులు బాదుతోందని ట్రంప్ నిందిస్తూనే ఉన్నారు.

తమ నుంచి టారిఫ్ లు వసూలు చేస్తున్న దేశాలపై తామూ ప్రతీకార టారిఫ్ లు వేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన గందరగోళానికి దారితీసింది. దీని మధ్య.. తాజాగా తమ మద్యం పై భారత్ 150 శాతం సుంకాలు పిండుతోందని అమెరికా ఆరోపించింది. మరికొన్ని ఉత్పత్తులపైనా ఇదే స్థాయిలో టారిఫ్ వేస్తోందని అభ్యంతరం వ్యక్తం చేసింది.

అమెరికా నుంచి అత్యధిక టారిఫ్ లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉందని.. మద్యంపై టారిఫ్ ను ఉదహరిస్తూ పేర్కొంది.

తమ అధ్యక్షుడు ప్రతీకార సుంకం ఆలోచనను అమెరికా యంత్రాంగం సమర్థిస్తోంది. పరస్పర, ప్రతి చర్యను ట్రంప్‌ నమ్ముతారని.. దేశాల మధ్య పారదర్శకత, సమతుల వాణిజ్య విధానాలు ఉండాలని కోరుకుంటారని తెలిపింది.

కాగా, కెనడా ఉక్కు,అల్యుమినియంపై టారిఫ్ లను ఉద్దేశించి మాట్లాడుతూ కెనడా కొన్ని దశాబ్దాల పాటు తమ నుంచి అత్యధిక సుంకాలతో డబ్బును దోచుకుందని.. చీజ్‌, బటర్‌ పై ఏకంగా 300 శాతం టారిఫ్‌ వసూలు చేసిందని అమెరికా మండిపడుతోంది. అందుకే ఇటీవల 25 శాతం టారిఫ్‌ విధించగా దానిని 50శాతానికి పెంచింది. ఇలాగే.. భారత్‌, జపాన్‌ వంటి దేశాలు కూడా చేస్తున్నాయని వైట్ హౌస్ మండిపడింది. భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం టారిఫ్ వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అమెరికా ఆల్కహాల్ బ్రాండ్ అయిన కెంటుకీ బోర్బన్ ను భారత్ కు ఎగుమతి చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులపై 100 శాతం పన్ను పిండుతున్న భారత్ కు కెంటుకీ బోర్బన్ ను ఎందుకు ఇవ్వాలని అమెరికా అభిప్రాయం పడుతోంది. కాగా, జపాన్‌ అమెరికా బియ్యంపై 700 శాతం టారిఫ్‌ విధిస్తోంది.

ఏప్రిల్ 2 విడుదల..

భారత్ పై ప్రతీకార సుంకాల అమలుకు ట్రంప్ ఏప్రిల్ 2 ను డెడ్ లైన్ గా నిర్ణయించారు. చైనా, ఇతర దేశాలపైనా టారిఫ్‌ లు అమల్లోకి తెస్తామని చెప్పారు. మెక్సికో, కెనడాపైనా మార్చి 4 నుంచి సుంకాలను అమల్లోకి తేగా.. కొన్ని ఉత్పత్తులకు మాత్రం ఏప్రిల్‌ 2 వరకు మినహాయింపు ఇచ్చారు.

Tags:    

Similar News