మళ్ళీ మేమే...జగన్ ధీమా వెనక !
ఏపీలో మళ్ళీ వచ్చేది మేమే అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు.;
ఏపీలో మళ్ళీ వచ్చేది మేమే అని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధీమాగా చెబుతున్నారు. వైసీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్న సందర్భంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గొంతు లేని వారికి బలమైన గొంతుకగా వైసీపీ పుట్టిందని అన్నారు.
ఈ పార్టీ ప్రజల కష్టాల నుంచి పుట్టింది. వారి కోసం పోరాడుతోంది. వైసీపీకి ఉన్న బలం కార్యకర్తలే అని జగన్ గట్టిగా చెప్పారు. క్యాడర్ కోసం వైసీపీ నిలబడుతుందని మాట ఇచ్చారు. వైసీపీ పదిహేనేళ్ళ ప్రస్థానంలో పదేళ్ళ పాటు ఉన్నది ప్రతిపక్షంలోనే అని ఆయన గుర్తు చేశారు.
విపక్ష పాత్ర నిర్వహించడం అన్నది వైసీపీకి కొత్త కాదు అని అన్నారు. పార్టీ ఓడిన తరువాత కళ్ళు మూసుకుంటే ఏడాది ఇట్టే గడచిపోయింది అని ఆయన అన్నారు. ఇక మిగిలిన మూడు నాలుగేళ్ల తరువాత మళ్ళీ అధికారంలోకి వచ్చేది కచ్చితంగా వైసీపీనే అని అన్నారు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదని చెప్పారు.
మరో వైపు చూస్తే వైసీపీ చెప్పినది చేస్తుందని ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత తమ పార్టీదని ఆయన అన్నారు. వైసీపీ చేసిన మేలు ప్రతీ ఇంట్లో ఉందని అందువల్ల వైసీపీ కార్యకర్త గర్వంగా రాష్ట్రంలో ఏ ఇంటి తలుపు అయినా తట్టి వారిని అన్నీ అడగవచ్చు అన్నారు. అవ్వలు తాతల నుంచి రైతులు శ్రామికులు బడుగులు ఇలా అన్ని వర్గాల ప్రజాలకు మేలు చేసిన పార్టీ వైసీపీయే అని ఆయన అన్నారు. వైసీపీ ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ అని ఆయన గుర్తు చేశారు. అధికార పక్షానికి ధీటైన జవాబు చెప్పే పార్టీ వైసీపీ మాత్రమే అన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న వారికి జగన్ ధన్యవాదాలు తెలిపారు.
వైసీపీ హయాంలో ప్రజలకు చేసిన మేలును ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ని వసతి దీవెనను కూడా బకాయిలు పెట్టారని ఆయన అన్నారు. ఏ ఒక్క పధకం అమలు చేయడం లేదని కానీ అన్నీ అమలు చేస్తామని చెప్పి జనాలను మభ్యపెట్టారని జగన్ విమర్శించారు. పార్టీ కార్యకర్తలు కూడా ప్రతీ సమస్యను తీసుకుని ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపు ఇచ్చారు.
ఇదిలా ఉండగా ఏపీలో కూటమి ప్రభుత్వం మీద జగన్ నిశితమైన విమర్శలు చేశారు. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం మీద జనంలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది అని అన్నారు. అందువల్ల వైసీపీ పట్ల జనంలో ఆదరణ అంతకంతకు పెరుగుతోందని జగన్ అన్నారు.
ఇదిలా ఉంటే మరోసారి మేమే అని జగన్ ధీమాగా చెప్పడానికి కారణం ఏంటి అన్న చర్చ సాగుతోంది. ఏపీలో ఉన్నవి రెండే రాజకీయ శిబిరాలు. ఒకటి అధికారంలో ఉన్న కూటమి, రెండవది వైసీపీ మూడవ ఫోర్స్ అయితే లేదు. కూటమి పట్ల జనాలకు వ్యతిరేకత పెరిగితే ఆల్టర్నేటివ్ గా వైసీపీయే ఉంది. దాంతోనే జగన్ ఈ విధంగా చెబుతున్నారు అని అనుకోవాల్సి ఉంది.
అంతే కాదు సంక్షేమ పధకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని అసంతృప్తి జనంలో ఉందని అది వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుందని కూడా భావిస్తున్నారు. అంతే కాదు రానున్న రోజులలో వైసీపీ పట్ల జనంలో సానుకూలత కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి చూస్తే ఏపీ పాలిటిక్స్ లో ఒక ఆనవాయితీ ఉంది. ఒకసారి ఒక పార్టీని మరోసారి ఇంకో పార్టీని గెలిపిస్తూ పోతారు. అందువల్ల ఈసారి చాన్స్ కచ్చితంగా వైసీపీదే అన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. చూడాలి మరి జగన్ ఇచ్చిన ఈ ధీమా కార్యకర్తలలో ఎంతమేరకు పనిచేస్తుందో ఏమో.