రేవంత్ రెడ్డిని కలిసిన మోహన్ బాబు, మంచు విష్ణు
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రముఖ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.;
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ప్రముఖ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణులు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు సోషల్ మీడియాలో స్పందిస్తూ "గౌరవనీయులైన తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో రాష్ట్ర అభివృద్ధి, తెలుగు చిత్ర పరిశ్రమ పురోగతి వంటి కీలక అంశాలపై చర్చించడం గొప్ప అనుభూతి. చిత్ర పరిశ్రమకు ఆయన అందిస్తున్న మద్దతు, నిబద్ధత ప్రశంసనీయం" అని పేర్కొన్నారు.
అంతేగాక తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసాన్ని సందర్శించారు. గద్దర్ తెలంగాణ చలనచిత్ర పురస్కారాల విధివిధానాలను సీఎం ఆమోదించిన నేపథ్యంలో ఆయన ఈ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉండగా మంచు విష్ణు ప్రస్తుతం 'కన్నప్ప' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న విడుదల కానుంది.