బాబు ఫ్యూచర్ ప్లాన్.. 'ఫైర్ బ్రాండ్ల'కు ఛాన్స్ అప్పుడే.. !
తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి మూడు స్థానాలను టీడీపీ తీసుకుంది.;
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యూచర్ ప్లాన్ చేయడంలో విజన్‌తో ముందుకు సాగడంలో దిట్ట. ఇప్పుడు కూడా ఆయన ఇదే పంథాను అనుసరించారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి మూడు స్థానాలను టీడీపీ తీసుకుంది. మిగిలిన రెండు స్థానాల్లో జనసేనకు ఒకటి, టీడీపీకి ఒకటి కేటాయించారు. అయి తే.. టీడీపీ తరఫున మూడు స్థానాలకు అసలు పోటీలో కూడా లేని కావలి గ్రీష్మ, బీటీ నాయుడులను చంద్రబాబు ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అదేవిధంగా బీద రవిచంద్ర యాదవ్ బరిలో ఉన్నా.. ఎంపిక అయ్యే వరకు ఆయన వ్యవహారం కూడా సస్పెన్స్‌గానే సాగింది.
ఇక, అసలు పోటీలో గట్టిగా పేర్లు వినిపించిన మాజీ మంత్రులు కేఎస్ జవహర్, దేవినేని ఉమా మహేశ్వరరావు, సీనియర్ నాయ కుడు, మాజీ ఎమ్మెల్యే వర్మ, సీనియర్ నేత టీడీ జనార్దన్, దువ్వారాపు రామారావు వంటివారికి అసలు ప్రాధాన్యం లేకుండా పోయింది. వారి పేర్లు చివరి నుంచి రెండో జాబితాలోనే లేకుండా పోయాయని సమాచారం. ఇక, ఈ వ్యూహానికి కారణం కూడా ఉందని అంటున్నారు. 2027లో జరిగే ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో వీరికి ప్రాధాన్యం దక్కనుందని సమాచారం. అయితే.. అప్పటి వరకు వీరిని ఎందుకు వెయిటింగులో పెట్టారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2027తో పోల్చుకుంటే.. 2029 నాటికి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటికి మండలిలో దాదాపు పూర్తిగా టీడీపీనే ఉండే అవకాశం ఉంటుంది. దీంతో 2029 ఎన్నికల్లో పొరపాటున వైసీపీ అధికారంలోకి వస్తే.. బలమైన గళం వినిపించేందుకు అవకాశం ఉండే నాయకులను చంద్రబాబు ఎంపిక చేయాలన్న వ్యూహంతోనే ఇలా వీరిని పక్కన పెట్టారని అంటున్నారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్లు ఇవ్వకపోయినా.. ఎమ్మెల్సీలుగా పంపించామన్న సంతృప్తి కూడా ఉండనుంది. అందుకే చాలా వ్యూహాత్మకంగా చంద్రబాబు వీరిని పక్కన పెట్టారని సీనియర్లు భావిస్తున్నారు.
ఇక, ఇప్పుడు ఎంపిక చేసిన వారిలో సామాజిక సమతూకంతోపాటు.. ప్రాంతాల మధ్య కూడా సమన్వయం పాటించడంతో ఇబ్బందులు లేకుండా ఉంటాయని భావిస్తున్నారు. 2027 నాటికి ఖాళీ అయ్యే స్థానాలతో ప్రస్తుతం ఉన్న ఆశావహులు అందరినీ మండలికి పంపించడం ద్వారా.. ఎన్నికలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు .. అవకాశం ఉంటుందన్న బావన కూడా ఉందని సీనియర్లు చెబుతున్నారు. అందుకే.. ఇప్పుడు కొంత వెసులుబాటు ఇచ్చినా.. వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు.. ఆయా నేతలను బుజ్జగించే పనిలో ఉన్నారు.