వైసీపీకి ఛాన్స్ ఇస్తున్న తమ్ముళ్లు.. !
ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మహిళకు చెందిన చీనీ తోటలను ఆక్రమించేందుకు స్థానిక టీడీపీ నేతలు ప్రయత్నించారన్న విమర్శలు వచ్చాయి.;
రాష్ట్ర స్థాయిలో వైసీపీ పుంజుకోకుండా ఉండాలని.. ఆ పార్టీ విషయంలో సానుభూతి పెరకుండా ఉండాలని టీడీపీ, జనసేన పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం తమ దారిలో తాము వెళ్తున్నారు. ఫలితం గా వైసీపీ నేతలకు అవకాశం కల్పిస్తూ.. కూటమి సర్కారును టార్గెట్ చేసే పనిని కల్పిస్తున్నారు. ఆదివారం ఒక్కరోజే వరుసగా చోటు చేసుకున్న పలు పరిణామాలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. కర్నూలు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల పరిధిలో టీడీపీ, జనసేన నాయకులు వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ మహిళకు చెందిన చీనీ తోటలను ఆక్రమించేందుకు స్థానిక టీడీపీ నేతలు ప్రయత్నించారన్న విమర్శలు వచ్చాయి. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. పోలీసులు మౌనం పాటించారు. దీనికి టీడీపీ నేత సిఫారసులే కారణమని తెలిసింది. అంతేకాదు.. ఓ పోలీసు అధికారి ఆదేశాలతో కొందరు టీడీపీ నాయకులు సదరు మహిళకు చెందిన చీనీ(బత్తాయి) తోటలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకుని మహిళ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను చితక బాదారు. దీంతో ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రికి చేరారు. ఈ ఘటనపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరసన వ్యక్తం చేశారు. అంతేకాదు.. మహిళను ఓదార్చి తామున్నాంటూ భరోసా కల్పించారు.
ఇక, తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన నాయకుడు వరుపుల తమ్మయ్య బాబు ఓ మహిళా వైద్యాధికారిని దూషించారు. తాను సిఫారసు చేసిన రోగికి తక్షణం వైద్యం అందించలేదన్నది ఆయన ఆరోపణ. అయితే.. తాము అందరినీ సమానంగా చూస్తామని వైద్యురాలు చెబుతున్నారు. దీంతో ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్లి దూషించి.. బండబూతులు తిట్టారని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తమ విధులను నిలిపివేసి.. నిరసన వ్యక్తం చేశారు. ఇక, ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ నాయకులు.. జనసేనపై నిప్పులు చెరిగారు. ఆవెంటనే సదరు తమ్మయ్యను పవన్ కల్యాణ్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇక, ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు వ్యవహారం పార్టీ అధిష్టానానికి మరింత తలనొప్పిగా మారింది. రామాయపట్నం ఓడరేపు పనులు చేపట్టిన ఓ కంపెనీని ఆయన నాలుగు రోజులుగా బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. వారి నుంచి లంచాలు డిమాండ్లు చేస్తున్నారని, లంచాలు ఇవ్వకపోతే.. పనుల్లో కమీషన్లు ఇవ్వాలని ఆయన షరతు పెట్టినట్టు తెలిసింది. ఇది రాజకీయంగా టీడీపీకి మరింత బ్యాడ్ నేమ్ తేవడంతో పాటు పెట్టుబడి దారులు ఆందోళన చేసే పరిస్థితిని తీసుకువచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయినట్టు సమాచారం. కాగా.. ఈ విషయం కూడా వైసీపీకి కలిసి వచ్చి.. పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడం గమనార్హం. మొత్తానికి తమ్ముళ్ల వ్యవహరిస్తున్న తీరుతో వైసీపీకి ఊపు వచ్చే అవకాశాలు వున్నాయని అంటున్నారు పరిశీలకులు.