భారత్ లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం... మంత్రి కీలక వ్యాఖ్యలు!
చైనాలో హ్యూమన్ మెటాఫ్ నిమో వైరస్ (హెచ్ఎంపీవీ) తీవ్ర కలకలం సృష్టిస్తోందని చెబుతున్న వేళ తాజాగా భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించారు.
చైనాలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హెచ్ఎంపీవీ వైరస్ వ్యవహారం ఇప్పుడు భారత్ లోనూ మొదలైంది! చైనాలో వైరస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కరోనా మహమ్మారనే సంగతి తెలిసిందే. తాజాగా మరో వైరస్ అనే సరికి భారత్ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో భారత్ లో ఈ కొత్త వైరస్ ఇప్పటివరకూ ముగ్గురికి సోకినట్లు చెబుతున్నారు.
అవును... చైనాలో హ్యూమన్ మెటాఫ్ నిమో వైరస్ (హెచ్ఎంపీవీ) తీవ్ర కలకలం సృష్టిస్తోందని చెబుతున్న వేళ తాజాగా భారత్ లోనూ ఆ వైరస్ ను గుర్తించారు. ఇందులో భాగంగా.. తాజాగా కర్ణాటకలో 3, 8 నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది.
దేశవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధుల విషయంలో ఐసీఎంఆర్ సాధారణ పర్యవేక్షణలో భాగంగా ఈ రెండు కేసులు వెలుగు చూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో మూడు నెలల చిన్నారి వైరస్ నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగా.. మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిపింది.
ఈ నేపథ్యంలో భారత్ లో తాజాగా మూడో కేసు నమోదైనట్లు కథనాలొస్తున్నాయి. ఇందులో భాగంగా... గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ చాంద్ ఖేడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పేషెంట్ చేరారని.. ఆ చిన్నారి వయసు రెండు సంవత్సరాలని కథనాలొస్తున్నాయి. దీంతో... దేశంలో కొత్త వైరస్ కేసుల సంఖ్య మూడుకి చేరినట్లైంది.
అయితే... మీడియా చెప్తున్నట్లు ఇదేమీ హెచ్ఎంపీవీ ఫస్టు కేసు కాదని.. ఆ వైరస్ ఎప్పటి నుంచో ఉనికిలో ఉందని కర్ణాటక హెల్త్ మినిస్టర్ దినేశ్ గుండూరావ్ అన్నారు. ఇదే సమయంలో... బెంగళూరులో వైరస్ సోకిన ఇద్దరు చిన్నారులకు ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదని.. అందువల్ల ఇది ఫస్ట్ కేసు అంటూ తప్పుదోవపట్టించొద్దని కోరారు!
ఇదే క్రమంలో... దీనికి దగ్గు, జలుబు వంటి సాధారణ లక్షణాలే ఉన్నాయని మంత్రి తెలిపారు. అయితే.. చైనాలో ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది మాత్రం హెచ్ఎంపీవీ కొత్త వేరియెంట్ అని తెలిసిందని కర్ణాటక హెల్త్ మినిస్టర్ దినేశ్ గుండూరావ్ అన్నారు.