రాజకీయ కంపు కొట్టిస్తున్నడీఎంకే ఎంపీ వ్యాఖ్యలు..
హిందీ రాష్ట్రాలలో బీజేపీ గెలుపు అందుకే అంటూ ఆయన విమర్శిస్తున్నారు.
తమిళనాడుకు చెందిన అధికార పార్టీ డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఉత్తరాదిన మూడు రాష్ట్రాలలో బీజేపీ గెలుపు మీద సెంథిల్ కుమార్ తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ఘాటు విమర్శలు చేశారు.
బీజేపీ గెలిచిన రాష్ట్రాలు గోమూత్ర రాష్టాలట. అందుకే బీజేపీ అక్కడ గెలవగలిగిందట. పైగా వాటిని తాము గోమూత్ర రాష్ట్రాలుగానే పిలుస్తామని సెంథిల్ కుమార్ సమర్ధించుకుంటున్నారు. హిందీ రాష్ట్రాలలో బీజేపీ గెలుపు అందుకే అంటూ ఆయన విమర్శిస్తున్నారు.
గోమూత్రం తాగే రాష్ట్రాలు అని పేరు కూడా పెట్టారు. ఇంతకీ ఆయన బీజేపీని విమర్శించే క్రమంలో గో మూత్రాన్ని విమర్శించారా లేక ఏకంగా బీజేపీని గెలిపించినందుకు ఆయా రాష్ట్రాలలోని కోట్లాదిమందిని విమర్శించారా అన్నది అయితే తెలియడంలేదు.
ఆయనకు బీజేపీ అంటే రాజకీయ ద్వేషం ఉండవచ్చు. సిద్ధాంతపరమైన విభేదాలు ఉండవచ్చు. బీజేపీ మార్క్ హిందూత్వ మీద కూడా ఆయన విభేదించవచ్చు. కానీ గోమూత్రం అన్నది ఒక మంచి మందు అని ఆయుర్వేదం చెబుతోంది. దాన్ని నమ్మేవారూ ఉన్నారు. మరి ఆ నమ్మకాన్ని ఆయన కించపరచవచ్చునా. ఆ హక్కు ఆయనకు ఉందా అన్నది ఒక సూటి ప్రశ్న.
అంతే కాదు బీజేపీని గెలిపించిన రాష్ట్రాలలో కాంగ్రెస్ కూడా ఎక్కువ సీట్లే తెచ్చుకుంది. మరి ఇది నంబర్ గేమ్. ఒక్క ఓటు ఒక్క సీటు అధికంగా వచ్చినా అధికారం వస్తుంది. మరి బీజేపీని గెలిపించిన రాష్ట్రాలు గోమూత్ర రాష్ట్రాలు అయితే బీజేపీకి ఓటేయని ప్రజలను కూడా ఆ గాటికి కట్టేసి విమర్శించవచ్చా.
అయినా రాజకీయం అంటే పరిధి పరిమితి ఉండాలి కదా ఏకంగా ప్రజల విశ్వాసాలను మత విశ్వాసాలను వారి సెంటిమెంట్లను కూడా మధ్యలోకి తెచ్చేసి విమర్శించే హక్కు ఎవరికి అయినా ఉంటుందా. డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ ఈ వ్యాఖ్యలే ఇపుడు వివాదం కావడం కాదు రాజకీయ కంపు కొట్టిస్తున్నాయని అంటున్నారు.
అఫ్ కోర్స్ అందరు నేతల మాదిరిగానే ఆయన తాను ఉద్దేశ్య పూర్వకంగా అనలేదని ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చారనుకోండి.అయినా ముందు అనేసి ఆనక అనలేదు అంటే ఒప్పుకుందా. అయినా బీజేపీ గెలుపు వెనకాల డీఎంకే భావి వారసుడు ఉదయనిధి స్టాలిని సనాతన ధర్మం మీద చేసిన వ్యతిరేక వ్యాఖ్యల ప్రభావం కూడా ఉందని ఎందుకు సెంథిల్ వంటి వారు గ్రహించలేకపోతున్నారు అన్నది ప్రశ్న. బీజేపీ పేరుతో సెంటిమెంట్ల మీద విమర్శలు చేస్తూ పోతే అది రాజకీయంగా బీజేపీకే ప్లస్ అవుతుందని డీఎంకే వంటి పార్టీలు గ్రహించ నంత కాలం కమల వికాసానికి ఢోకా ఉండదంతే.