ప్రియురాలి సజీవ దహనం... లారెన్స్ బిష్ణోయ్ ఫ్లాష్ బ్యాక్ తెలుసా?
లారెన్స్ ది పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లా ధత్తరన్ వాలీ గ్రామంలోని ఓ సంపన్న కుటుంబం. లారెన్స్ 12వరకు చదివాడు..
ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధీఖ్ హత్యతో ముంబై మహానగరం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... దేశవ్యాప్తంగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగుతోంది. దీంతో... ఎవరీ బిష్ణోయ్, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఈ వ్యవహారాలు ఎప్పుడు మొదలు పెట్టాడు మొదలైన విషయాలపై చర్చ మొదలైంది.
అవును... బాబా సిద్ధీఖ్ హత్యతో ముంబై మహా నగరం ఉలిక్కిపడటంతో పాటు.. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గురించిన చర్చా మొదలైంది. పైగా 31 ఏళ్ల ఈ పంజాబీ గ్యాంగ్ స్టర్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అయినప్పటికీ అతడి సోదరుడు, అనుచరుడు కెనడా నుంచి గ్యాంగ్ ను నడిపిస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయంలో ఆందోళనకారంగా మారింది.
లారెన్స్ ది పంజాబ్ లోని ఫిరోజ్ పుర్ జిల్లా ధత్తరన్ వాలీ గ్రామంలోని ఓ సంపన్న కుటుంబం. లారెన్స్ 12వరకు చదివాడు.. అనంతరం పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోని దయానంద్ ఆంగ్లో వేద కళాశాల (డీఏవీ) లో చేరాడు. ఈ క్రమంలో జాతీయ స్థాయి అథ్లెట్, పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా చేశాడు.
ఆ తర్వాత జరిగిన పరిచయంతో లైఫ్ మారింది! ఇందులో భాగంగా... విద్యార్థి రాజకీయాల్లో గోల్డీ బ్రార్ తో పరిచయం ఏర్పడటం.. కొన్నాళ్లకు మెల్లమెల్లగా అసాంఘిక కార్యకలాపాలు మొదలుపెట్టడం జరిగిపోయాయి. ఈ సమయంలో కాలేజ్ గ్యాంగ్ వార్ లో అతడి ప్రియురాలిని ప్రత్యర్థి వర్గం సజీవ దహనం చేసింది! దీంతో అతడు పూర్తిగా నేరాల వైపు మళ్లినట్లు చెబుతుంటారు.
ఈ క్రమంలోనే 2018లో తన అనుచరుడు సంపత్ నెహ్రాతో కలిసి సినీ స్టార్ సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రపన్నడంతో జాతీయ స్థాయి వార్తలకెక్కాడు. ఇదే క్రమంలో... లారెన్స్ సన్నిహితుడు జస్విందర్ ను గ్యాంగ్ స్టర్ జైపాల్ భుల్లర్ హత్య చేశాడు. మరోపక్క బిష్ణోయ్ గ్యాంగ్ సీమాంతర ఆయుధ స్మగ్లింగ్ చేస్తుందని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఆరోపిస్తోంది.
ఇక లారెన్స్ ను చంపేందుకు ఇప్పటికే ఢిల్లీలోని గ్యాంగ్ స్టర్స్ కాచుకుని కూర్చొన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అతడిని వివిధ కేసుల్లో జైలు నుంచి కోర్టులకు తరలించడం పోలీసులకు కత్తిమీద సాముగా మారిందని చెబుతున్నారు.
సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు!:
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడటం.. దానికి సంబంధించిన కేసు ఇప్పటికీ నడుస్తుండటం తెలిసిందే! ఈ కృష్ణజింకలను బిష్ణోయ్ వర్గం వారు పవిత్రంగా పరిగణిస్తారు. దీంతో... వీటిని వేటాడంపై అదే వర్గానికి చెందిన లారెన్స్ కు ఏమాత్రం నచ్చలేదు. ఫలితంగా... 2018 నుంచి సల్మాన్ లక్ష్యంగా ఈ గ్యాంగ్ పనిచేస్తోంది.
ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ లో సల్మాన్ ఇంటిపై కాల్పులు కూడా జరిపింది. అంతక ముందు అతడి ఫామ్ హౌస్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు చెబుతుంటారు.
జైలు నుంచి ఎలా నడిపిస్తున్నాడు..?:
ప్రస్తుతం బిష్ణోయ్ గ్యాంగ్ లో పలువురు ప్రొఫెషనల్ షూటర్లు ఉన్నారు. చిన్నా చితకా కలిపి వీరి సంఖ్య సుమారు 700 వరకూ ఉండోచ్చని చెబుతున్నారు. ఇక వీరి నెట్ వర్క్ పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ లలో విస్తరించింది.
లారెన్స్ ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నా.. తన గ్యాంగ్ ను మాత్రం నిరాటంకంగా నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో అతడి సోదరుడు అన్మోల్, మిత్రుడు గోల్డీ బ్రార్ లు ఈ వ్యవహారాలు చూసుకొంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోనే వీరు భయానక గ్యాంగ్ గా పేరు తెచ్చుకొంది.
ఈ నేపథ్యంలోనే ముంబైలో ఖాళీగా ఉన్న మాఫియా రాజ్యాన్ని ఆక్రమించడానికి లారెన్స్ & కో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది!