డ్రీమర్ ఓకే, బర్త్ రైట్ సిటిజన్ షిప్ నాట్ ఓకే... ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
అవును... ఎన్.బీ.సీ. న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ చేయబోయే పాలనపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ట్రంప్ తన దృష్టంగా వలసదారులపై కేంద్రీకరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ అంచనాలకు బలం చేకూర్చే వ్యాఖ్యలు చేశారు.
అవును... ఎన్.బీ.సీ. న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బర్త్ రైట్ సిటిజన్ షిప్ ని రద్దు చేయడంతోపాటు దేశంలోని అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని కోరుతున్నారు. అయితే... "డ్రీమర్స్" అని పిలవబడే వలసదారులను మాత్రం రక్షించాలనుకుంటున్నారు.
జన్మహక్కు పౌరసత్వం రద్దు!:
అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడానికి కార్యనిర్వాహక చర్య తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిపారు. తల్లితండ్రుల ఇమ్మిగ్రేషన్ స్థితితో సంబంధం లేకుండా యూఎస్ లో జన్మించిన ఎవరికైనా జన్మహక్కు పౌరసత్వం ఇవ్వబడుతుంది. దీని ట్రంప్ రద్దుచేయాలని బలంగా ఫిక్సయ్యారు!
వాస్తవానికి... జన్మహక్కు పౌరసత్వాన్ని రద్దు చేయడం అంత ఈజీ కాదని.. ఈ విషయంలో ట్రంప్ ప్లాన్స్ సులభంగా సాధించబడవని అంటున్నారు. ఈ చర్య ఎన్నో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ హక్కు యూఎస్ రాజ్యాంగ సవరణ ద్వారా రాగా.. 1989లో సుప్రీంకోర్టు మద్దతు తెలిపింది!
అక్రమ వలసదారుల సాముహిక బహిష్కరణ!:
జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుండి అక్రమ వలసలను జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించి.. దేశవ్యాప్తంగా అణిచివేతకు ఆదేశాలివ్వాలని కూడా భావిస్తున్నారని చెబుతున్నారు. వాస్తవానికి... 2022 జనవరి నాటికే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ అమెరికాలో సుమారు 11 మిలియన్ల అక్రమ వలసదారులను అంచనా వేసింది.
ఇప్పుడు వీరి సంఖ్య మరింత పెరిగి ఉంటుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... చట్టపరమైన హోదా లేకుండా ఉన్న అందరినీ బహిష్కరించాలని ట్రంప్ బలంగా భావిస్తున్నారు. అయితే... దీనికి చాలా నియమాలు, నిబంధనలు, చట్టాలు ఉన్నాయని ట్రంపే చెబుతున్నారు.
'డ్రీమర్' లను రక్షించే ఆలోచన!:
మరోపక్క బాల్యంలోనే తల్లితండ్రులతో పాటు అమెరికాకు వలస వచ్చి అక్కడే పెరిగి పెద్దయిన వలసదారులు (డ్రీమర్స్) విషయంలో ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా వీరి గురించి స్పందించిన ట్రంప్... చాలా చిన్న వయసులోనే దేశానికి తీసుకురాబడిన వీరు ఇప్పుడు మధ్య వయస్కులని ట్రంప్ అన్నారు.
వీరంతా ఇప్పుడు అమెరికాలో భాగమైపోయారని.. వీరు వారి వారి మూల దేశపు భాష కూడా మాట్లాడరని అన్నారు. వారిని అమెరికా వదులుకోదన్నట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించారు!
కాగా... బాల్యంలోనే తల్లితండ్రులతోపాటు అమెరికాకు వలస వచ్చి అక్కడే పెరిగి పెద్ద్దయిన వలసదారులను (డీమర్స్) వెనక్కి తిప్పిపంపకుండా నిరోధిస్తున్న ప్రభుత్వ విధానం చట్టవిరుద్ధమని ఫ్లోరిడాలోని జిల్ల కోర్టు 2023 సెప్టెంబర్ లో తీర్మానించిన సంగతి తెలిసిందే.