తగ్గుతున్న ఆఫ్ లైన్.. జోరు మీదున్న ఆన్ లైన్

కరోనాతో మొదలైన కొన్ని ట్రెండ్లు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది ప్రజల కొనుగోలు తీరులో వచ్చిన మార్పులు

Update: 2024-03-26 04:21 GMT

కరోనాతో మొదలైన కొన్ని ట్రెండ్లు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యమైనది ప్రజల కొనుగోలు తీరులో వచ్చిన మార్పులు. ప్రపంచ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి అప్పటి లాక్ డౌన్ కారణంగా ఆఫ్ లైన్ కొనుగోళ్లపై ఆసక్తిని తగ్గించేసి.. ఆన్ లైన్ మీద ఫోకస్ పెంచేలా చేసింది. కరోనా అనంతరం కూడా ఆ అలవాటు అంతకంతకూ ఎక్కువ కావటమే తప్పించి తగ్గని పరిస్థితి. తాజాగా విడుదలైన ఒక నివేదిక ఇదే అంశాన్ని వెల్లడించటమే కాదు.. అదెంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని తెలిసేలా చేస్తోంది.

ప్రజల తమ కొనుగోలు అవసరాల్ని ఆఫ్ లైన్ స్టోర్ల కంటే ఆన్ లైన్ స్టోర్ల మీదనే ఎక్కువగా ఆధారపడుతున్న విషయాన్ని నీల్సన్ ఐక్యూ.. జీఎఫ్ కే ఇండియా సంయుక్తంగా రూపొందించిన నివేదికలో వెల్లడించింది. కరోనా తదుపరి పరిణామాల్ని ఈ నివేదిక కళ్లకు కట్టేలా తెలిపింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రజలపై ప్రభావాన్ని చూపటమే కాదు.. తమకు అవసరమైన వస్తు కొనుగోళ్లకు ఆన్ లైన్ మీదనే ఎక్కువగా ఆధారపడుతున్నట్లుగా పేర్రకొంది.

సంప్రదాయ పద్దతిలో షాపులకు వెళ్లి తమకు నచ్చిన వస్తువుల్ని కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపటం లేదు. అందుకు భిన్నంగా ఆన్ లైన్ లోని ఈ కామర్స్ వైపే మొగ్గు చూపటం గమనార్హం. దీనికి తోడు డోర్ డెలివరీ వ్యవస్థ అంతకంతకూ విస్త్రతం కావటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. దీంతో నిత్యవసరాల్ని సైతం ఆన్ లైన్ లో కొనుగోళ్లు చేస్తున్నట్లుగా నివేదిక వెల్లడించింది. కూరగాయల నుంచి టీవీలు.. ఫ్రిజ్ లు లాంటి వస్తువుల్ని సైతం ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే ధోరణి పెరిగిందని.. చివరకు 55 అంగుళాలకు మించిన టీవీలను సైతం ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు పెరిగినట్లుగా పేర్కొంది. ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు 2023లో రెట్టింపు అయినట్లుగా నివేదిక వెల్లడించింది. మొత్తంగా ట్రెండ్ చూస్తే ఆఫ్ లైన్ కొనుగోళ్లు తగ్గుతుంటే.. ఆన్ లైన్ కొనుగోళ్లు అంతకంతకూ ఊపందుకుంటున్నాయని చెప్పాలి.

Tags:    

Similar News