సలహాదారుల సుద్దులకూ హద్దులు: కోడ్ వర్తింపు
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనావళి అమల్లో ఉన్న విషయం తెలిసిందే.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనావళి అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఇది కేవలం రాజకీయ పార్టీలకు, నాయకులకు, కార్యకర్తలకు, ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు మాత్రమేనా? అంటే.. కాదని అంటోంది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రభుత్వాల్లో ఉంటూ.. సలహాదారు లు గా చలామణి అయ్యేవారికి కూడా కోడ్ వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఎంత మంది సలహాదారులు ఉన్నారనేది లెక్కకాదు. ఎవరు ఉన్నా.. కోడ్‌కు అనుగుణంగానే వ్యవహరించాలని తేల్చి చెబుతోంది.
ఏపీ విషయాన్ని తీసుకుంటే.. సలహాదారులుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి.. సహా పలువురు తరచుగా మీడియా ముందుకు వస్తున్నారు. ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఏకరువు పెడుతున్నారు. అయితే.. ఆయా సందర్భాల్లో వారు కోడ్‌ను విస్మరిస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణలు. వీటిపైనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. వీటిని నిశితంగా పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రజా ధనాన్ని పారితోషికంగా పోందుతున్న సలహాదారులు కూడా కోడ్ కిందకే వస్తారని తేల్చి చెప్పింది.
అంటే.. రాజకీయ నేతలకు, పార్టీలకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో.. అవే పూర్తిగా సలహాదారులకు కూడా వర్తిస్తాయి. అంటే.. ప్రభుత్వం ఇచ్చిన కార్యాలయాలను వినియోగించి.. ప్రెస్ మీట్లు పెట్టకూడదు. ప్రభుత్వ వాహనాలు వినియోగించకూడదు. ప్రచారం చేయకూడదు. అదేవిధంగా నేతలకు అనుకూ లంగా ప్రసంగాలు చేయరాదు. ఒక రకంగా.. ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా వ్యవహరించాలో అంతే విధానంలో సలహాదారులు కూడా వ్యవహరించాలి. ఈ విషయంలో తేడా వస్తే.. వారిపై చర్యలు తీసుకుంటామని ఈసీ తేల్చి చెప్పింది.