ఊర్లకు బయల్దేరిన నగరవాసులు... ఎన్ని వేల బస్సులంటే..?

అవును... ఈ ఎన్నికలు ఏపీలో అత్యంత కీలకం అనే మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఒకరు.. గెలిస్తేనే నిలుస్తామనే కసితో మరొకరు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.

Update: 2024-05-10 16:49 GMT

ఈ వారంలో ఈ రోజు చివరి వర్కింగ్ డే కూడా పూర్తవ్వడంతో ఊర్లకు బయలుదేరుతున్నారు నగర వాసులు! ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 13 (సోమవారం)న అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్‌ లో నివసించే ఏపీ వాసులంతా తమ ఊర్లకు తండోపతండాలుగా తరలివెళ్తున్నారు. దీంతో... రైల్వే స్టేషన్లూ, బస్ స్టాండ్ లూ కిటకిట లాడుతున్నాయి!

అవును... ఈ ఎన్నికలు ఏపీలో అత్యంత కీలకం అనే మాట రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఒకరు.. గెలిస్తేనే నిలుస్తామనే కసితో మరొకరు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. ఈ సమయంలో ప్రతీ ఓటూ అత్యంత కీలకం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో... నగరంలో ఉన్న సుమారు ప్రతీ ఓటరూ తమ తమ గ్రామాలకు బయలుదేరి వెళ్తున్నారని తెలుస్తుంది.

ఎవరికి వారు ఎంతో విలువైన ఓటును నిర్లక్ష్యం చేయవద్దని భావించి.. జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఏపీ జనాలు బయలుదేరుతున్నారు! ఇలా ప్రజలంతా ఓట్ల పండుగకు వెళ్తుండటంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. ఇదే సమయంలో... మరి కొంతమంది సొంత వాహనాల్లో వెళ్తున్నారు.

దీంతో నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది! సుమారు వారం పది రోజుల నుంచే ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో సీట్లన్నీ ఫుల్‌ అయ్యాయని అంటున్నారు. ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, తూర్పు పశ్చిమ గోదావరి, ఒంగోలు, గుంటూరు తదితర జిల్లాలకు వెళ్లే వారితో కూకట్ పల్లి, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, దిల్‌ సుఖ్‌ నగర్‌, ఎల్బీనగర్‌, సాగర్‌ రింగ్‌ రోడ్డు బస్టాప్‌ లలో రద్దీ భారీ నెలకొంది!

మరోపక్క సార్వత్రిక ఎన్నికల వేళ టీఎస్‌ ఆర్టీసీ సుమారు 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఇందులో భాగంగా... ఎంజీబీఎస్‌ నుంచి 500, ఉప్పల్‌ నుంచి 300, ఎల్బీనగర్‌ నుంచి 300, జేబీఎస్‌ నుంచి 200 చొప్పున ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో... శుక్ర, శని, ఆదివారాల్లో నడిచే 450 బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి!

Tags:    

Similar News