భారత్‌ లో ప్రవేశానికి ఎలాన్‌ మస్క్‌ కొత్త వ్యూహం ఇదే!

ఈ నేపథ్యంలో ముందుగా భారత్‌ లో బ్యాటరీ స్టోరేజ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి.. తయారీ – విక్రయం వంటి వాటికి కూడా మస్క్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Update: 2023-09-22 16:30 GMT

టెస్లా, స్పేస్‌ ఎక్స్, ట్విట్టర్‌ కంపెనీల అధినేత ఎలాన్‌ మస్క్‌ గురించి తెలియనివారు లేరు. ప్రపంచంలోనే అపర కుబేరుడయిన మస్క్‌ ఇప్పుడు భారత్‌ పై దృష్టి సారించారనే వార్త హాట్‌ టాపిక్‌ గా మారింది. ఎలాన్‌ మస్క్‌ కు చెందిన కార్ల కంపెనీ.. టెస్లా భారత్‌ మార్కెట్‌ వైపు దృష్టి పెట్టింది.

భారతీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌ రోజు రోజుకి శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. కార్ల విక్రయాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు భారత్‌ ను లక్ష్యంగా చేసుకున్నాయి. కొత్తగా వస్తున్న ఏ ఆధునిక టెక్నాలజీ కారయినా మొదటగా భారత్‌ లోనూ ప్రవేశిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికన్‌ బ్రాండ్‌ అయిన టెస్లా కూడా భారత్‌ లో ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుందని తెలుస్తోంది.

అంతేకాకుండా ఎలక్ట్రిక్‌ కార్లకు, విద్యుత్‌ బ్యాటరీలకు కూడా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో టెస్లా కంపెనీ భారత్‌ లో బ్యాటరీ స్టోరేజీ ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది.

ఇటీవల మన దేశంలో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి ఎలాన్‌ మస్క్‌ ప్రధాని నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే సుమారు 24,000 కోట్ల డాలర్ల విలువైన ప్లాంట్‌ ను భారతదేశంలో ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ముందుగా భారత్‌ లో బ్యాటరీ స్టోరేజ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి.. తయారీ – విక్రయం వంటి వాటికి కూడా మస్క్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సోలార్‌ ప్యానల్స్, గ్రిడ్‌ నుంచి విద్యుత్‌ ను నిల్వ చేసుకుని రాత్రి సమయంలో లేదా విద్యుత్తుకు అంతరాయం కలిగిన సందర్భంలో ఉపయోగించుకోవడానికి ఇలాంటి బ్యాటరీలు ఉపయోగపడతాయని చెబుతున్నారు.

ఈ క్రమంలో బ్యాటరీ స్టోరేజ్‌ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాకాలను కోరుతూ ఇప్పటికే ఎలాన్‌ మస్క్‌ భారత ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించినట్లు తెలుస్తోంది. టెస్లా ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సుముఖత చూపే అవకాశం ఉందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని అటు టెస్లా ప్రతినిధులు కానీ, ఇటు భారత ప్రభుత్వం కానీ తెలపలేదు. వార్తలు వచ్చినట్టు జరిగితే టెస్లా భారతదేశంలో అడుగుపెట్టడం ఖాయమేనని అంటున్నారు. అలాగే ఇప్పటికే ఈ రంగంలో ఉన్న కంపెనీలను కూడా అధిగమిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

బ్యాటరీ ఫ్యాక్టరీ ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని నిపుణులు కూడా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరెంటుకు అంతరాయం కలిగినప్పుడు ఇలాంటి వాటిని ఉపయోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా బొగ్గు తదితరాల కర్బన ఉద్గారాలను వెలువరించే వాటి స్థానంలో ప్రత్యామ్నాయాలపై ప్రభుత్వాలు కూడా దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో టెస్లా మన దేశంలో అడుగుపెట్టడానికి ఇదే సరైన సమయం అంటున్నారు.

Tags:    

Similar News