దూరపు కొండలు నునుపు కాదు... కెనడాలో భారతీయ విద్యార్థి పోస్ట్ వైరల్!

అవును... కెనడా వచ్చి తాను అతిపెద్ద పొరపాటు చేశానంటూ తన అనుభవాలను ఓ భారతీయ విద్యార్థి రెడిట్ లో పోస్ట్ చేశాడు.;

Update: 2025-03-19 13:57 GMT

ఇటీవల కాలంలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు మెట్రో పాలిటన్ సిటీస్ లోనూ, పట్టణాల్లోనూ కాస్త ధనవంతుల పిల్లలు మాత్రమే విదేశీ విమానాలు ఎక్కేవారు! అయితే.. కాల క్రమంలో దేశంలోని ప్రతీ గ్రామంలోనూ కనీసం ఒక్కరైనా విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్నరన్నా అతిశయోక్తి కాదు.

అంటే.. విదేశాల్లో ఉన్నత చదువులపై ఆస్థాయిలో అశక్తి నెలకొందని చెప్పాలా.. లేక, అవకాశాలు అంతగా విస్తరిస్తున్నాయని భావించాలా అంటే.. రెండు పరస్పరం అని చెప్పొచ్చు! అయితే... అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. అక్కడున్న మధ్యతరగతి విద్యార్థులకు కొత్త కష్టాలు మొదలయ్యాయనే చర్చ నడిచిన సంగతి తెలిసిందే.

ప్రధానంగా చదువుకుంటూ, పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుని, ఊరిలో ఉన్న విద్యారుణాలను తీర్చుకుంటున్న వారి కష్టాలు వర్ణనాతీతం అని అంటున్నారు. అయితే... అమెరికాలోనే కాదు కెనడాలోనూ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదని.. ఏదేశంలో అయినా పరిస్థితి ఇలానే ఉన్నట్లుందని చెబుతూ.. కెనడాలో తన పరిస్థితిని వివరిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు భారతీయ విద్యార్థి ఒకరు.

అవును... కెనడా వచ్చి తాను అతిపెద్ద పొరపాటు చేశానంటూ తన అనుభవాలను ఓ భారతీయ విద్యార్థి రెడిట్ లో పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా తన పేరును మాత్రం వెళ్లడించకుండా.. తన కలలు, కెనడాలోని కష్టాలు మొదలైన విషయాలను వివరించే ప్రయత్నం చేశాడు. దీంతో... ఈ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా తన పోస్ట్ లో... కెనడా ప్రభుత్వం, ఆ దేశంలోని కాలేజీలు తమ తమ లాభాపేక్ష కోసం భారతీయ విద్యార్థులను ఉపయోగించుకుంటున్నాయని.. చాలా మంది తక్కువ నాణ్యత విద్యను అందించే కాలేజీల్లో భారీ ఫీజులు చెల్లించి మరీ చేరి మోసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అటువంటి కాలేజీల్లో ఫ్రొఫెసర్లకు చదువు చెప్పాలన్న ఉద్దేశ్యమే ఉండదని.. అవుట్ డేటెడ్ సిలబస్ అక్కడ ఉంటుందని.. ఆ చదువు చదివి, ఆ డిగ్రీలు సంపాదించినా.. వాటితో జాబ్స్ తెచ్చుకోవడం సాధ్యం కాదని.. అటువంటి కాలేజీల్లో చదివిన చదువులు పలు కంపెనీలు సీరియస్ గా తీసుకోవని సదరు విద్యార్థి హెచ్చరించారు.

అయితే.. వ్యక్తిగత అనుభవమో ఏమో కానీ సదరు విద్యార్థి తన పోస్ట్ లో ప్రధానంగా బో వ్యాలీ కాలేజీ గురించి ప్రత్యేకంగా ప్రస్థావించారు. ఇది అత్యంత నాసిరకమైన కాలేజ్ అని.. ఇక్కడ చదివేవారు డైలి ఖర్చుల కోసం గోదాముల్లో పని చేస్తున్నారని తెలిపారు. ఉన్నత చదువుల కోసం భారత్ ను వీడాలనుకునేవారు పునరాలోచించుకోవాలని సూచించారు.

అయితే... ఈ అభిప్రాయంతో చాలా మంది ఏకీభవించగా, మరికొంతమంది విభేధించారు. మంచీ చెడూ అన్ని చోట్లా ఉంటుందని.. అది ఎంక్వైరీ చేసుకోకుండా చిన్న చితకా కాలేజీలో చెరితే చివరకు కష్టాలు, అప్పుల తిప్పలు మిగులుతాయని చెబుతున్నారు. కెనడాలో చదువుకుని స్థిరపడినవారు చాలామందే ఉన్నారంటూ స్పందిస్తున్నారు.

Tags:    

Similar News